టిఎస్‌ఆర్‌ జాతీయ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానం..ఉత్తమ నటులుగా బాలకృష్ణ, నాగార్జున

- February 18, 2019 , by Maagulf
టిఎస్‌ఆర్‌ జాతీయ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానం..ఉత్తమ నటులుగా బాలకృష్ణ, నాగార్జున

విశాఖపట్నం పోర్టు స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి టిఎస్‌ఆర్‌ జాతీయ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ మోహన్‌బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2017 ఉత్తమ నటుడుగా బాలకృష్ణ, ఉత్తమ డైరెక్టర్‌గా క్రిష్‌ ఎంపికయ్యారు. 2018 ఉత్తమ నటుడుగా దేవదాస్‌ సినిమాకు గానూ నాగార్జున తీసుకోగా, శైలజారెడ్డి అల్లుడు సినిమా స్పెషల్‌ జ్యూరీ అవార్డును నాగ చైతన్య, హలో సినిమా స్పెషల్‌ జ్యూరీ అవార్డును అఖిల్‌ తరపున నాగార్జున అందుకున్నారు. అవార్డులను మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా ప్రదానం చేశారు. దాసరి నారాయణరావు మెమోరియల్‌ అవార్డును మోహన్‌బాబు అందుకున్నారు. 2018 ఉత్తమ నటుడు (రంగస్థలం) అవార్డును, మోస్ట్‌ పాపులర్‌ మూవీ నిర్మాత( ఖైదీ నెంబర్‌ 150) అవార్డును రామ్‌చరణ్‌ తరపున చిరంజీవి అందుకున్నారు. 2018 ఉత్తమ సినిమా అవార్డు (మహానటి)ను నిర్మాత ప్రియాంక దత్‌ అందుకున్నారు.

అదే సినిమాకు ఉత్తమ డైరెక్టర్‌గా నాగ్‌ అశ్విన్‌, బెస్ట్‌ క్యారెక్టర్‌ అవార్డును రాజేంద్రప్రసాద్‌, బెస్ట్‌ చైల్డ్‌ అవార్డును సాయి తేజస్విని అందుకున్నారు. అవుట్‌ స్టాండింగ్‌ లిరిక్‌ రైటర్‌ అవార్డును సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఇచ్చారు. మొత్తం 24 మందికి అవార్డులు ప్రదానం చేశారు. శ్రీదేవి, దాసరి నారాయణరావు మెమోరియల్‌ అవార్డులను కూడా ఈ సందర్భంగా అందించారు.

రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యాన సాగిన ఈ కార్యక్రమంలో హీరోలు విశాల్‌, సుమంత్‌, అలీ, హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, పూజా హెగ్డే, కుష్బు, రాశీకన్నా, ప్రియమణి, అదితీరావ్‌ హైదరీ, కేథరిన్‌, ప్రజ్ఞ జైస్వాల్‌, నిర్మాత బోనీ కపూర్‌, పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com