కాలినడకన తిరుమలకు బయలుదేరిన రాహుల్‌

- February 22, 2019 , by Maagulf
కాలినడకన తిరుమలకు బయలుదేరిన రాహుల్‌

తిరుపతి:అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడక ద్వారా తిరుమలకు బయలుదేరారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ శ్రేణులు కొండపైకి తరలి వెళ్తున్నారు. నాలుగు గంటల నడక అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు రాహుల్‌.

 

అంతకు ముందు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాహుల్‌కు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ చింతా మోహన్‌తో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి చేరుకున్న రాహుల్‌…కాలినడక ద్వార తిరుమలకు బయలుదేరారు. దర్శనం అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరుపతి తారక రామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో రాహుల్‌ పాల్గొంటారు.

2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ ప్రకటించారు. అయితే కేంద్రం మాట తప్పింది. స్పెషల్ స్టేటస్ రాలేదు. దీంతో తిరుపతి సాక్షిగా మాట ఇచ్చిన మోదీని మళ్లీ తిరుపతిలోనే టార్గెట్ చేయనున్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు. మాట ఇచ్చి తప్పిన సభాస్థలి నుంచే మోదీని నిలదీయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని గత కొన్ని రోజులుగా చెబుతున్నారు రాహుల్‌ గాంధీ.

ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులతో పాటు ఇతర ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. జనాలను పెద్ద ఎత్తున తరలించేందు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సభ జరిగే తారకరామ స్టేడియాన్ని కేంద్రబలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు.

రాహుల్‌ను స్వాగతిస్తూ తిరుపతిలో కాంగ్రెస్‌ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాహుల్ పర్యటనతో ఏపీ కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఎన్నికల వేళ కార్యకర్తల్లో ఆత్మస్తైర్యం పెంచేందుకు, పార్టీ బలోపేతానికి రాహుల్ పర్యటన ఉపయోగపడుతుందని ఏపీ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com