తెలుగు రాష్ట్రాల మధ్య సిట్ ఫైట్

- March 09, 2019 , by Maagulf
తెలుగు రాష్ట్రాల మధ్య సిట్ ఫైట్

రెండు రాష్ట్రాల మధ్య రాజుకున్న డేటా వార్.. ఇప్పుడు సిట్ ఫైట్ గా మారుతోంది. డేటా చోరీపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఫారం-7 బోగస్ అప్లికేషన్లపై మరో సిట్ ను ఏర్పాటు చేసింది. మరోవైపు.. ఏపీలో ఓటర్ల జాబితా అవకతవకల వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఎన్నికల సంఘాన్ని కలిసిన ఏపీ బీజేపీ నేతలు…. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు.

ఎన్నికల వేళ అనూహ్యంగా తెరపైకి వచ్చిన డేటా చోరీ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు అటు తెలంగాణ, ఇటు ఏపీలో పొలిటికల్ గా చిచ్చు రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు అదనపు డీజీపీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం…ఇక ఓట్ల తొలగింపు కుట్రపైనా సీరియస్ గా ఉంది. దీనిపై ఏపీలో సుమారు 400 వరకూ కేసులు నమోదయ్యాయి. వెల్లువలా వచ్చి పడుతున్న ఫామ్-7 బోగస్ అప్లికేషన్ల మూలాలను ఛేదించేందుకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె. సత్యనారాయణ ఆధ్వర్యంలో మరో సిట్ ను ఏర్పాటు చేసింది.మొత్తం 8 మంది సభ్యులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

డేటా చోరీ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన సిట్ చీఫ్ తొలి రోజున డీజీపీతో భేటీ అయ్యారు. ఈ వ్యవహారంలో విచారణను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేసుని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని.. ఎవరెవరి ఇన్వాల్వ్‌మెంట్‌ ఉందో తెలియాలంటే డాక్యుమెంట్లు పూర్తిగా స్టడీ చేయాలన్నారు సిట్‌ ఇంఛార్జి బాలసుబ్రమణ్యం.

మరోవైపు సిట్‌-2కి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ సత్యనారాయణ.. డీజీపీ ఠాకూర్‌ను కలిశారు. ఫామ్‌-7 దుర్వినియోగంపై విచారణలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు. ఇప్పటి వరకూ నమోదైన కేసులు, విచారణ తీరుపై చర్చించారు. బల్క్‌గా ఫామ్‌లు పంపిన చోట.. ఈ కుట్రల వెనుక ఎవరన్నారో టెక్నాలజీ సాయంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఫామ్-7 బోగస్ అప్లికేషన్లపై ఏర్పాటు చేసిన సిట్ తో ఈసీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఏపీ డీజీపీ ఠాకూర్. ప్రత్యర్ధి పార్టీల ఓట్లు తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తు దుర్వినియోగం చేసే ప్రక్రియ కొత్తగా మొదలైందని అన్నారాయన. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు భద్రతపరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించిన డీజీపీ లైసెన్స్ డ్ ఆయుధాలు పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలని సూచించారు.

మరోవైపు.. ఏపీలో ఓటర్ల జాబితా అవకతవకల వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలో జీవీఎల్, మాదవ్ సహా పలువురు నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఉండే ప్రజల డేటాను అక్రమ పద్దతుల్లో సేకరించి.. అందులో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలిగించారని ఫిర్యాదు చేశారు. వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపించాలని కోరారు.

మొత్తానికి డేటా చోరీ ఎపిసోడ్‌ ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల రాజకీయాలను హీటెక్కిస్తోంది. మరి ఈ ఎపిసోడ్‌కు ఎప్పుడు ముగింపు చెబుతారా అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com