వారిపై దాడులు చేస్తే సహించేది లేదు

- March 09, 2019 , by Maagulf
వారిపై దాడులు చేస్తే సహించేది లేదు

ఎన్నికల సమరంలో ప్రధాని మోదీ స్పీడ్ పెంచారు. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. యూపీలోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన మోదీ…అక్కడ కాశీ విశ్వనాథ్ ఆలయ నడవాకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా దేశంలో కశ్మీరీ‌లపై జరుగుతున్న మూక దాడులను తీవ్రంగా ఖండించారు.

మళ్లీ అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటనలతో దేశాన్ని చుట్టేస్తున్నారు. అభివృద్ధి పథకాల ప్రారంభం.. శంకుస్థాపనతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించిన ప్రధాని.. కాశీ విశ్వనాథ్ ఆలయ నడవాకు శంకుస్థాపన చేశారు. ఆలయ కారిడార్ నిర్మాణంతో టెంపుల్ క్లాంప్లెక్స్ నుంచి గంగా నదికి నేరుగా అనుసంధానం జరుగుతుంది. కాశీ పర్యటనకు వచ్చే యాత్రికులకు ఈ కారిడార్‌ చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నారు మోదీ. మన సంస్కృతికి గర్వకారణమైన విశ్వనాధ ఆలయంలో ప్రార్థనలు సంతోషంగా ఉందన్నారు.

మరోవైపు…. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీరీలపై దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లక్నోలోని దలీగంజ్ ప్రాంతంలో కాశ్మీర్‌కు చెందిన వ్యాపారులపై దాడి జరిగింది. కాషాయ దుస్తులు ధరించిన కొందరు యువకులు అతనిపై దాడి చేశారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కశ్మీరీ‌లకు దేశంలో రక్షణ కరువైందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈనేపథ్యంలో యూపీ టూర్‌లో ప్రధాని మోదీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీరీ సోదరులపై దాడులను సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఐక్యమత్యాన్ని స్థిరంగా కొనసాగించడం తమ లక్ష్యమన్న మోదీ.. కాశ్మీరీ సోదరులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com