ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

- March 10, 2019 , by Maagulf
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ రానుంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో షెడ్యూల్ వివరాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు సిక్కిం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెల్లడిస్తారు. షెడ్యూల్ ప్రకటించిన తక్షణమే దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి రానుంది.

 
లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిలకు 7 నుంచి 10 విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ తేదీల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఎలక్షన్ నోటీఫికేషన్ విడుదల అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉంది.

సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి మోడీ సర్కార్‌ను ఎట్టిపరిస్థితుల్లో గద్దె దించాలన్న లక్ష్యంతో.. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. జాతీయ స్థాయిలో మహాకూటమిగా కలిసి ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. పుల్వామా ఉగ్రదాడిపై కూడా రాజకీయంగా మాటల తూటాలు పేలాయి. వారం కిందటి వరకూ సరిహద్దులో పాకిస్థాన్‌తో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. ఎన్నికలు వాయిదా పడొచ్చన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ వేడి చల్లారిన నేపథ్యంలో.. సార్వత్రిక షెడ్యూల్ విడుదలవుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌లు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తొలివిడత లిస్ట్ కూడా ప్రకటించి కదనానికి సై అంటోంది. సోనియా, రాహుల్‌ పోటీ చేసే స్థానాలతోపాటు మరికొన్ని ప్రకటించారు. ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కూడా ఉంది. ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు కూడా రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ప్రధాని మోడీ మరోసారి వారణాశి నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇవాళ షెడ్యూల్ వచ్చేస్తే.. అభ్యర్థుల లిస్టులు కూడా వెంటవెంటనే రిలీజ్ చేసి ప్రచారంలో దూసుకెళ్లేందుకు పార్టీలు రెడీ అయ్యాయి.

సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి కూడా అధికారంలోకి వచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. వైపీసీ ఈసారి గద్దెనెక్కేది తామేనని బలంగా నమ్ముతోంది. ప్రజల్లో టీడీపీ సర్కారుపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఐతే.. ఎన్నికల షెడ్యూల్‌కి ముందే కొన్ని కీలకమైన పథకాల్ని అమలు చేయడం ద్వారా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పెన్షన్లు రెట్టింపు చేయడం, అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ లాంటి పథకాలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. ఇవాళ వెలువడే షెడ్యూల్‌లో ఒకే ఫేజ్‌లోనే ఎన్నికలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు కూడా సింగిల్ ఫేజ్‌లోనే జరిపేలా షెడ్యూల్ రిలీజ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com