అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో రైల్‌కు ముహూర్తం షురూ

- March 19, 2019 , by Maagulf
అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో రైల్‌కు ముహూర్తం షురూ

ఎన్నాళ్లుగానో హైటెక్‌ సిటీ మార్గంలో మెట్రో రైల్‌ కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్ నగరవాసుల కోరిక తీరనుంది. బుధవారం ఉదయం 9.15కి గవర్నర్‌ నర్సింహన్‌ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో పచ్చజెండా ఊపి లాంచనంగా ప్రారంభించనున్నారు. అమీర్‌పేట టూ హైటెక్‌ సిటీ మార్గం బుధవారం సాయంత్రం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. పది కిలోమీటర్ల దూరం ఉండే ఈమార్గంలో మెట్రో రాకతో ట్రాఫిక్‌ కష్టాలు తగ్గనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో ఎలాంటి హడావిడి లేకుండా దీనిని ప్రారంభిస్తున్నారు..
 
దేశంలో అతి పెద్ద ఐటీ కారిడార్‌గా ఉన్న మాదాపూర్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తుండడంతో లక్షలాదిమంది ఉద్యోగులకు ఊరట కలగనుంది. నగరం నలుమూలల నుంచి లక్షలాది మంది హైటెక్‌ సిటీ పరిధిలో ఉన్న ఐటీ, ఐటీ అధారిత కంపెనీల్లో పనిచేస్తున్నారు. మెట్రో కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారి కోరిక బుధవారం నుంచి తీరనుంది. ప్రతి 9 నుంచి 12 నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

హైటెక్‌ సిటీ వరకు మెట్రో ప్రారంభం కానుండడంతో రెండు కారిడార్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మొదటి కారిడార్ అయిన మియాపూర్ టూ ఎల్బీ నగర్‌ వరుకు 29 కిలోమీటర్లు కాగా కారిడార్‌ త్రీ కింద నాగోల్ టూ హైటెక్‌ సిటీ 27 కిలోమీటర్లు మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దీంతో మొత్తం 56 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే 46 కిలోమీటర్లతో దేశంలో రెండో అతిపెద్ద మెట్రో కారిడార్‌గా హైదరాబాద్‌ మెట్రో ఉండగా.. మరో 10 కిలోమీటర్లు దానికి జత కానుంది. మొదటి దశలో ప్రతిపాదించిన 72 కిలోమీటర్లతో మరో 15 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి రావాల్సి ఉంది.

అమీర్‌ పేట నుంచి హైటెక్‌ సిటీ మార్గంలో ఉన్న 8 మెట్రో స్టేషన్లలో మూడు స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. మెట్రో కారిడార్‌ పూర్తిగా వంపులు తిరిగి ఉండడం , రైళ్లు నెమ్మదిగా ప్రయాణించాల్సి ఉండడంతో ఫ్రీక్వెన్సీ ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.. దీనికి తోడు ట్విన్ సింగిల్ లైన్ విధానం అమలులో ఉంది. దీంతో జూబ్లిహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి , దుర్గం చెరువు మెట్రో స్టేషన్లలో రైళ్లను నిలపకుండా నేరుగా హైటెక్‌ సిటీ వరకు నడిపేలా నిర్ణయించారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com