ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు తప్పనిసరిగా మెరుగుపరచుకోవలసిన అంశాలు..

- March 19, 2019 , by Maagulf
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు తప్పనిసరిగా మెరుగుపరచుకోవలసిన అంశాలు..

మార్కులు చూడబోతే 90% ఉన్నాయి. కానీ ఏంటో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు. ఎక్కడ డ్రా బ్యాకో అర్థం కావట్లేదు. అని అనుకునేకంటే అవేంటో ఎవరికి వారు తెలుసుకుని వాటిపై దృష్టి సారిస్తే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగానికి సన్నద్ధమయ్యే ముందే కొన్ని స్కిల్స్‌పై అవగాహన అవసరం. 

ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్: అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించుకోవాలి. అలాగే గడువులోపే ఆ ప్రణాళికను సమగ్రంగా అమలు చేయాలి. 

కమ్యూనికేషన్ స్కిల్స్: ముందు ఎవరైనా ఏదైనా చెబుతుంటే శ్రద్ధగా వినడం చెయ్యాలి. అవసరమైనప్పుడు మాట్లాడాలి, ముఖ్యమైన పాయింట్లు రాసుకోవడం, ప్రజెంట్ చేసే అవకాశం వచ్చినప్పుడు చక్కగా వివరించగలగడం అవసరం. ఇతరుల కోణంలో ఆలోచించి చూడగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. నాయకత్వ నైపుణ్యాలను కలిగివుండాలి. ఏదైనా పని మీకు అప్పగించినప్పుడు బాధ్యతగా చేయడం నేర్చుకోవాలి. 
మీకు ఇష్టమైన రంగంలో ఉద్యోగం పొందాలనుకున్నప్పుడు పట్టువీడక ప్రయత్నించాలి. ఒకటీ రెండు సార్లు ప్రయత్నించి రావట్లేదని డీలా పడిపోకూడదు. మొదటి ప్రయత్నమే విజయవంతం కావాలంటే సరైన కోచింగ్ సెంటర్‌ని ఎన్నుకోవాలి. దానికి తోడు మీ ప్రయత్నం దానికి రెట్టింపు ఉండాలి. 

విదేశాల్లో చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా అదనంగా ఒక భాషపై పట్టు ఉండడం చాలా అవసరం. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు వివిధ కార్యకలాపాలు అంటే సెమినార్లు, డిబేట్లు, కేస్ స్టడీస్, మాక్ పార్లమెంట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతైనా అవసరం. తద్వారా మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ కూడా మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. 

కాలేజీ స్పోర్ట్ బృందంలో ఉంటే టీమ్‌లో పని చేసే సామర్థ్యాలు పెరుగుతాయి. కోర్సు సంబంధిత ప్రాజెక్టులు, సమ్మర్ ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రజంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. పర్యావరణ సంబంధ ప్రాజెక్టుల్లో పనిచేస్తే పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది. చదువుకుంటూనే మీ స్కిల్స్ పెంచుకునే ఏదైనా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తే ప్రొఫెషనల్ ప్రపంచం అర్థమవుతుంది. లింక్టిన్ వంటి బిజినెస్ సైట్లతో కెరీర్ లీడర్స్‌తో మంచి నెట్‌వర్క్ పెంచుకోవచ్చు. 

మీ నైపుణ్యాలు, ఆప్టిట్యూడ్ తదితర అంశాలు మీరు కలలుకనే జాబ్‌కు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలి. అందుకు ఆ రంగంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు, సంప్రదింపులు జరపడం మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com