రసవత్తరంగా మారిన కర్ణాటక పోరు

రసవత్తరంగా మారిన కర్ణాటక పోరు

కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలుస్తుండగా.జేడీఎస్ తరఫున ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి బరిలో నిలుస్తున్నారు. సుమలతకు బీజేపీ మద్దతు ప్రకటించింది. దీంతో అక్కడ సుమలత, నిఖిల్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంటోంది. మాండ్య నియోజకవర్గంలో వారిద్దరి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. అయితే మిత్ర ధర్మానికి విరుద్ధంగా మాండ్యకు చెందిన కాంగ్రెస్‌ నేతలు సుమలత వెంట నిలవడం పట్ల జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు.

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తులో భాగంగా మాండ్యను జేడీఎస్ దక్కించుకుంది. అయితే మాండ్యాలోని కాంగ్రెస్ నేతల మద్దతు కూడా తనకే ఉందని సుమలత ప్రకటించడంతో ఇరుపార్టీల మధ్య వార్ మొదలైంది. తన వెంట నిలుస్తున్న స్థానిక నేతలపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకున్నా వారు తన వెంటే ఉంటారన్నారు సుమలత. మాండ్యాలో పోటీని తేలిగ్గా తీసుకోవడం లేదన్న ఆమె, ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని వర్గాల ప్రజల మద్దతు తీసుకుంటామని చెప్పారు. మహిళల నుంచి తనకు విశేష మద్దతు లభిస్తున్నట్లు సుమలత తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సుమలతకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం జేడీఎస్ నాయకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, అంటే కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను మాండ్య నుంచి జేడీఎస్ అభ్యర్థిగా నిలబెట్టడమే. అందుకే సుమలతకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. అయితే అనూహ్యంగా సుమలత ఇండిపెండెంట్ గా రంగంలోనికి దిగడం, ఆమెకు బీజేపీ మద్దతు ప్రకటిస్తూ అభ్యర్థిని నిలపకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కంగుతిన్నాయి. చివరకు కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. దీనికి కర్ణాటక మాజీ సీఎం, దేవెగౌడ వ్యతిరేకి సిద్ధరామయ్య అనుకూలంగా మలుచుకున్నారు. మండ్య స్థానం నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్న సినీ నటి సుమలతకు పరోక్షంగా మద్దతివ్వడం ఇందుకు నిదర్శనం. దేవెగౌడ మనవడు నిఖిల్‌ను ఓడించడం కోసం ఆయన సుమలతకు పరోక్ష మద్దతునిస్తున్నారని విమర్శలున్నాయి.

Back to Top