మజిలీ రివ్యూ

- April 05, 2019 , by Maagulf
మజిలీ రివ్యూ

అక్కినేని బ్రాండ్‌కి ఉండే ఇమేజ్‌ని నాగచైతన్య సక్సెస్ పుల్ గా కొనసాగిస్తున్నాడు. సమంత, నాగచైతన్య కాంబినేషన్‌కి ఉన్న  క్రేజ్ ‘మజిలీ’ పై అంచనాలను పెంచింది. పెళ్ళి తర్వాత జంటగా తెరమీదకనబడుతున్న నాగచైతన్య, సమంత అందించిన ప్రేమకథ ఎలా ఉందో చూద్దాం..

 

కథ:
వైజాగ్ లో ఉండే పూర్ణ కి (నాగచైతన్య) క్రికెటర్ అవ్వాలనే కోరిక. రైల్వే టీం కి ఆడాలనేది అతని గోల్. చదువునుండి క్రికెట్ కి తన ప్రయాణం మార్చుకున్న పూర్ణ కి అన్షూ( దివ్వాన్ష) ప్రేమ మరో మలుపు తిప్పుతుంది. ఆ ప్రేమ కోసం తన కెరియర్ ని కూడా వదిలేసిన పూర్ణ క్రికెట్ కి దూరం అవుతాడు. ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా మారిన పూర్ణ జీవితం లోకి భార్య గా శ్రావణి( సమంత) వస్తుంది. పూర్ణ తను పోగొట్టుకున్న జీవితాన్ని శ్రావణి అందించాలనుకుంటుంది. కానీ పూర్ణ తన దగ్గరికి ఎవ్వరినీ రానివ్వడు. మరి పూర్ణ ఒక ఫెయిల్యూర్ పర్సన్ గానే మిగిలిపోతాడా..? శ్రావణి చేసే ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను తెచ్చాయి..? అనేది మిగిలిన కథ..?

కథనం:
ప్రేమ ఫెయిల్ అయినా జీవితం ఉంటుంది. ప్రేమలో ఓడిపోయినా జీవితం నిస్సారంగా గడపాల్సిన అవసరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మజిలీ చెప్పాలనుకున్న పాయింట్ ఇదే. కానీ ఈపాయింట్ చుట్టూ ఒక అందమైన ప్రేమకథను అల్లుకోవడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్ అయ్యాడు. పూర్ణ పాత్రలోని వేరియేషన్స్ ని నాగచైతన్య పెద్ద కష్ట పడుకుండా తెరమీదకు తీసుకొచ్చాడు.

ఇంటర్ చదివే కుర్రాడి నుండి 13ఏళ్ళ అమ్మాయి కి తండ్రి వయస్సున్న పాత్ర వరకూ చైతన్య కనిపిస్తాడు. జీవితంలోని చాలా ముఖ్యమైన ఆ సమయంలో ఎన్నో మజిలీలు.. ఆ మజిలీలు ఒక పండుగలా చూపాడు దర్శకుడు శివనిర్వాణ. టీనేజ్ కుర్రాడి పాత్ర లో నాగచైతన్య చాలా సహజంగా అనిపించాడు. ప్రేమలో మూడు రకాల వేరియేషన్స్ ని చూపించిన నాగచైతన్య ఈ సారి అలాంటి పాత్రలో చాలా సహజంగా ఇమిడిపోయాడు. టీనేజ్ లో ఉండే గోల్స్.. వాటిని పక్క దారిలో పడవేసే ప్రేమ.. తెలియని ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు.. ఎంచుకున్న గమ్యాన్ని ఎలా దూరం చేస్తాయి అనేదే చిత్ర కథాంశం. ఇటువంటి ఎమోషన్స్ ని చాలా సహజంగా మలిచాడు దర్శకుడు. పూర్ణ ప్రేమ కథలో అన్షూ పాత్రలో దివ్యాన్ష చక్కగా ఒదిగిపోయింది. ప్రేమ గెలవాలంటే సమాజం పెట్టిన హద్దులును దాటాలి అని తెలియని ఇద్దరి టీనేజర్స్ వారి జీవితాలను ఎలా కోల్సోయారో కొన్ని సన్నివేశాల్లో బాగా చూపించాడు దర్శకుడు. సినిమాటిక్ గా కంటే ఈ కథను అత్యంత సహజంగా మలిచాడు.

రావు రమేష్ పాత్ర ఈ కథకు బలంగా మారింది. కొడుకు బాగు పడాలి అనుకునే సగటు తండ్రికి ఉండే ఆవేదన ఆ పాత్రలో చాలా సహజంగా పలికించాడు. ‘‘ చిన్నప్పుడు నువ్వు తప్పటడుగులు వేస్తే పడకుండా పట్టుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు తప్పతాగి వస్తే పడకుండా పట్టుకుంటున్నాను’’ లాంటి డైలాగులు చాలా బాగున్నాయి. సమంత శ్రావణి పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తను ప్రేమించిన వాడు తనను ప్రేమించక పోయినా పర్లేదు. కానీ తనతో జీవితాంతం గడపొచ్చు అనుకునే మనస్తత్వం శ్రావణిది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరివి ఫెయిల్యూర్ లవ్ స్టోరీసే. కానీ ఆ క్యారెక్టర్స్ మధ్య ఉండే ఘర్షణ ఉండదు. ఒకరంటే ఒకరికుండే బాధ్యతను, ప్రేమను చూపించేందుకు దర్శకుడు రాసుకున్నసన్నివేశాలు బాగున్నాయి. రావు రమేష్ ఫోన్ మాట్లాడే సన్నివేశం ను పూర్ణ, శ్రావణి ల మద్య ప్రేమను ఎస్టాబ్లిష్ చేసేందుకు బాగా డిజైన్ చేసాడు దర్శకుడు . నాగచైతన్యప్రెండ్ క్యారెక్టర్ చేసిన సుహాస్ తన పాత్ర లో మెప్పించాడు. సమంత శ్రావణి పాత్ర లో ఒదిగిపోయిందనే చెప్పొచ్చు. చాలా పరిపక్వత గలిగిన పాత్రను అంతే హుందాగా ప్రజెంట్ చేసింది. ప్రేమ అనేది ఒక ఫేజ్ మాత్రమే కానీ ఆ ఫేజ్ లో ఎక్కువ కాలం ఉండకూడదు. అదే నాగచైతన్య ప్రెండ్ క్యారెక్టర్ తో చెప్పిన డైలాగ్ లా ఎప్పుడంటే అప్పుడు టైం మిషన్ ఎక్కి వెనక్కు ట్రావెల్ చేయగూడదు. ఈ ఫీల్ ని ఒక అందమైన కథగా మలచడంలో మజిలీ టీం సక్సెస్ అయ్యింది. గోపీ సుందర్ స్వరాలు, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథలో ఎమోషన్స్ ని ఎలివేట్ చేసాయి. కథ, కథనాలు కాస్త స్లో ఫేజ్ లో ఉండటం. ఏ ఎమోషన్ సీన్ కూడా పీక్స్‌కి తీసుకెళ్ళకుండా ఒక టెంపోలో కథనం సాగడం మజలీ లో అడ్డింకి గా మారాయి. నాగచైతన్య, సమంత కాంబినేషన్‌కి ఉండే  క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్‌ని సాధించిన ‘మజలీ’ ఫీల్ నిండిన ప్రేమకథగా మిగులుతుంది.

చివరగా:
ప్రేమకథలు ఇష్టపడే వారు మజిలీకి  బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్న ఈ ప్రేమకథ వేసవిలో హాయిని పంచే ఐస్ క్రీమ్  అవుతుంది ఈ మజిలీ.

 

--మాగల్ఫ్ రేటింగ్ 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com