హైదరాబాద్:ప్లే స్కూల్‌లో దారుణం

హైదరాబాద్:ప్లే స్కూల్‌లో దారుణం

హైదరాబాద్:మాదాపూర్ లోని ఓ ప్రముఖ ప్లే స్కూల్ లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆయాలే అమానుషంగా ప్రవర్తించారు. మూడున్నరేళ్ల పాపని లైంగికంగా వేధించారు. పాప ప్రైవేట్ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయాల వికృత చేష్టలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 10వ తేదీన పాప తల్లిదండ్రుల ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కొన్ని రోజుల క్రితం పాప ప్రైవేట్ భాగంలో తీవ్రమైన నొప్పితో ఏడ్చింది. అనుమానం వచ్చిన తల్లి.. ప్రైవేట్ భాగాన్ని పరిశీలించింది. అక్కడ గాయాలు చూసి షాక్ అయ్యింది. తల్లిదండ్రులు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లారు. పాప గాయాలను పరిశీలించిన డాక్టర్ కూడా షాక్ అయ్యారు. ప్రైవేట్ భాగంలో రాళ్లు చొప్పించారని డాక్టర్ చెప్పారు. అసలేం జరిగింది అని పాపను తల్లిదండ్రులు అడిగారు. స్కూల్ లో ఆయాలు ఇదంతా చేశారని పాప చెప్పింది. దీంతో తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆయాల దురాఘతంపై ఫిర్యాదు చేశారు. POSCO చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఆయాలను గుర్తించే పనిలో ఉన్నారు.

దీనిపై బాలల హక్కుల సంఘం ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. ఇంత వికృతంగా ప్రవర్తించిన ఆ ఆయాలను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోని స్కూల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ స్కూల్ ని మూసివేయాలన్నారు. నాంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది. పేరున్న ప్లే స్కూల్స్ లో పిల్లలను బాగా చూసుకుంటారని అంతా నమ్ముతారు. లక్షల రూపాయల ఫీజులు కట్టడానికి కూడా వెనుకాడరు. ఎంత ఖర్చైనా పర్లేదు పిల్లలను బాగా చూసుకుంటే చాలు అంటారు. అలాంటి నమ్మకాన్ని ఈ స్కూల్ వమ్ము చేసింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆయాలే ఇంత అమానుషంగా ప్రవర్తించడం, స్కూల్ యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడం పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది. తమ పిల్లల భద్రతపై వారు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు.

Back to Top