అబుధాబిలో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన పూర్తి

- April 21, 2019 , by Maagulf
అబుధాబిలో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన పూర్తి

అబుధాబి:గల్ఫ్‌ దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుధాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో దేవాలయ నిర్మాణానికి శనివారం (ఏప్రిల్ 20, 2019) శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బోచసన్‌వాసి శ్రీ అక్షర్‌ - పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) అధిపతి మహాంత్‌ స్వామి మహారాజ్‌ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి - దుబాయ్‌ హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా ఈ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆర్ట్‌ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు.

దేవాలయానికి అవసరమైన స్థలాన్ని యువరాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయద్‌ అప్పగించారు. 2015 లో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అబుదాబిలో హిందూ దేవాలయం లేదు. పూజలు, ప్రార్థనల కోసం దుబాయ్‌కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ రెండు ఆలయాలు, గురుద్వార ఉన్నాయి. కర్ణాటకలోని ఉడిపికి చెందిన బి.ఆర్‌.శెట్టి అబుదాబిలో ప్రముఖ వ్యాపారవేత్త. 1968లో ఆయన ఉడిపి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ప్రధాని మోడీతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. మోడీ యూఏఈ పర్యటనలో బి.ఆర్‌.శెట్టి కీలక పాత్ర పోషించారు.ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి టి.టి.డి JEO లక్ష్మీకాంతం దంపతులు హాజరయ్యారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com