తెలంగాణ:విద్యార్థుల భవిష్యత్తు ఆగం కావడం వెనక ఆ సంస్థ..

- April 22, 2019 , by Maagulf
తెలంగాణ:విద్యార్థుల భవిష్యత్తు ఆగం కావడం వెనక ఆ సంస్థ..

తెలంగాణ:ఇంటర్‌ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో భారీస్థాయిలో అవకతవకలకు.. లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు ఆగం కావడం వెనక ఓ ప్రైవేటు సంస్థ నిర్వాకమే కారణం. కనీస అర్హతలు లేకుండానే ఇంటర్మీడియట్‌ డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌ బాధ్యతలను చేజిక్కించుకున్న సంస్థ.. ప్రక్రియనంతా అడ్డదిడ్డంగా చేపట్టడంతోనే పరిస్థితి తారుమారైందంటున్నారు నిపుణులు. ఫలితాల్లో పొరపాట్లు ఎలా జరిగాయి? విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఫలితాల్లో గైర్హాజరైనట్లు ఎలా రికార్డయింది? టాపర్లు, మెరిట్‌ రికార్డున్న విద్యార్థులు ఒక సబ్జెక్టులో.. అదీ అత్యంత తక్కువ మార్కులతో ఎలా ఫెయిలయ్యారు? అనే అంతుచిక్కని ప్రశ్నలకు బోర్డు నుంచి జవాబు రావడంలేదు. చేసిన ఘనకార్యా న్ని కప్పిపుచ్చుకునేందుకు.. అవసరమైతే రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొమ్మని బోర్డు సలహా ఇవ్వడం తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణమవుతోంది.

ఈ మొత్తం వ్యవహారంలో ఓ ప్రైవేటు సంస్థ పేరు తెరమీదకు వచ్చింది. ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు మొదలు, ఫలితాల వెల్లడివరకు అవసరమైన సాంకేతిక సహకారమంతా.. మొన్నటివరకు ప్రభుత్వ రంగ సంస్థ – సీజీజీ (సెంటర్‌ ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌) అందించేది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి మాత్రం ఈ బాధ్యతల్ని అన్ని అర్హతలున్న ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల పిలిచారు. తక్కువకు కోట్‌ చేసిన గ్లోబరీనా సంస్థకు అప్పగించారు. దీంతో అడ్మిషన్ల నుంచి ఫలితాలు విడుదల చేసే వరకు జరిగే డేటా ప్రాసెసింగ్, ఫీజు ప్రాసెసింగ్, ఫలితాల ప్రాసెసింగ్‌ గ్లోబరీనా చేతుల్లోకి వెళ్లింది. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో పెద్దఎత్తున తప్పిదాలు జరగడానికి ఈ సంస్థే కారణమంటున్నారు.

గ్లోబరీనా సంస్థకు టెండరు కట్టబెట్టడం, డీపీఆర్పీ ప్రాజెక్టు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబరీనాకు పలు కేటగిరీల్లో అర్హత లేకున్నా అక్రమంగా డీపీఆర్పీ అధికారాలు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. దేశవ్యాప్తంగా కనీసం 3లక్షల మంది విద్యార్థులున్న ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీకి వరుసగా 5ఏళ్ల పాటు సాంకేతిక ఆధారిత పరీక్షల ప్రక్రియలో సహకారం అందించి ఉండాలి. దేశవ్యాప్తంగా ఐదు ప్రభుత్వ బోర్డులు లేదా యూనివర్సిటీలకు సాంకేతిక ఆధారిత పరీక్షలకు కచ్చితంగా పనిచేసి ఉండాలి. అందులో తప్పకుండా ఇంటర్మీడియట్‌ బోర్డు ఉండాలి. కానీ గ్లోబరీనాకు ఈ రెండు అర్హతలు లేవని చెబుతున్నారు.

డీపీఆర్పీ ప్రాజెక్టు దక్కించుకున్న గ్లోబరీనాకు అర్హతలు లేకపోవడానికి తోడు సరైన అనుభవం లేకపోవడంతో ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో భారీ తప్పిదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. డీపీఆర్పీ ప్రాజెక్టు దక్కించుకోవాలంటే అంతకు ముందు ఇంటర్మీడియట్‌ డాటా ప్రాసెసింగ్, రిజల్ట్‌ ప్రాసెసింగ్‌లో భాగస్వామ్యమై ఉంటే.. అనుభవం వచ్చేది. కానీ గ్లోబరీనాకు ఈ వ్యవహారంలో కనీస అనుభవం కూడా లేదని స్పష్టమైంది. ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు 10లక్షల మంది వి ద్యార్థుల భవిష్యత్తును ఎలా అప్పగించారు? దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటున్నారు తల్లిదండ్రులు. ఉపాధ్యాయ సంఘాలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com