ఈనెల 28న ఉగ్రదాడులు జరిగే అవకాశం!

- April 26, 2019 , by Maagulf
ఈనెల 28న ఉగ్రదాడులు జరిగే అవకాశం!

శ్రీలంకలో ఇంకా భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఏ క్షణం ముష్కరులు విరుచుకుపడతారోనన్న భయాందోళన మధ్యే ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అటు.. ఈనెల 28న మరోసారి ఉగ్రదాడులు జరిగగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మరోవైపు..ఇంకా ఉగ్రవాద దాడుల ముప్పు ఉండొచ్చని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే అన్నారు. ప్రస్తుతం తాము స్లీపర్‌సెల్స్‌పై దృష్టి సారించామని తెలిపారు. తాజా పేలుళ్ల నిందితులతోపాటు స్లీపర్లుగా ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇంకా పేలుళ్లు జరగొచ్చనే అనుమానంతో ఇలా చేస్తున్నామని తెలిపారు. అటు.. అధ్యక్షుడి సూచనమేరకు రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం రాజీనామా చేశారు. మరోవైపు ఈస్టర్‌ పేలుళ్లలో బుధవారం నాటికి 359 మంది మరణించారని ప్రకటించిన శ్రీలంక… మృతిచెందిన వారి సంఖ్య 253 మాత్రమేన స్పష్టం చేసింది. పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వీసా ఆన్‌ అరైవల్‌ అవకాశాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ విధానం ప్రకారం 39 దేశాల ప్రజలకు శ్రీలంకకు చేరుకున్నాక అక్కడ వీసా పొందే అవకాశం గతంలో ఉండేది. పర్యాటకులను ఆకర్షించడం కోసం శ్రీలంక ఈ విధానాన్ని గతంలో తీసుకొచ్చింది. అయితే గత ఆదివారం శ్రీలంకలో జరిగిన పేలుళ్లకు విదేశాలతో సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో తాజాగా వీసా ఆన్‌ అరైవల్‌ను శ్రీలంక తాత్కాలికంగా నిలిపివేసింది.

పేలుళ్లకు సంబంధించి తాజాగా మరో 16 మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 76కి పెరిగింది. ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌కు ఉన్నంత సమర్ధత.. ఈ దాడులకు వ్యూహరచన చేసిన వ్యక్తికి ఉంటుందంటూ శ్రీలంకలో అత్యంత విజయవంతమైన జనరల్‌గా పేరున్న ఫీల్డ్‌ మార్షల్‌ శరత్‌ ఫోన్సెకా కీలక వ్యాఖ్యలు చేశారు.

అటు.. పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇందులో ముగ్గురి మహిళల పాత్ర ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ఫొటోల విషయంలో శ్రీలంక ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. జాబితాలో ఫాతిమా ఖాదీయా ఉగ్రవాదికి బదులు అమెరికా సామాజిక కార్యకర్త అమరా మజీద్‌ ఫొటోను ప్రచురించింది. ఈ విషయాన్ని గుర్తించిన అమరా మజీద్‌ ట్విటర్‌ వేదికగా తనేలాంటి ఉగ్రదాడుల్లో పాలుపంచుకోలేదని, అనవసరంగా నా ఫొటోను ఎందుకు ప్రకటించారని వరుస ట్వీట్లతో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ట్వీట్లతో మేల్కొన్న శ్రీలంక ప్రభుత్వం పొరపాటును గుర్తించింది. సామాజిక కార్యకర్తైనా అమరా మజీద్‌కు క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com