యూఏఈలో ఆ పాపకు జనన ధ్రువీకరణ పత్రం

- April 28, 2019 , by Maagulf
యూఏఈలో ఆ పాపకు జనన ధ్రువీకరణ పత్రం

యూఏఈ:యూఏఈ చరిత్రలో మొట్టమొదటి సారి హిందూ తండ్రి, ముస్లిం తల్లికి పుట్టిన పాపకు ఆ దేశ ప్రభుత్వం జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. తొమ్మిది నెలల వయసులో ఆ పాప ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందుకుంది. యూఏఈ వివాహ నిబంధనల ప్రకారం ఇస్లాం మతానికి చెందిన పురుషుడు.. ఇతర మతాలకు చెందిన మహిళను పెళ్లాడవచ్చు. కానీ, ఇస్లాం మతానికి చెందిన మహిళ మాత్రం ఇతర మతాలకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకోకూడదు. అయితే, ఆ దేశం 2019వ ఏడాదిని 'సహన సంవత్సరాది'గా ప్రకటించింది. దీంతో నిబంధనలను పక్కకు పెట్టి ఓ పాపకు జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. షార్జాలో నివసిస్తున్న భారత్‌కు చెందిన కిరణ్‌ బాబు అనే వ్యక్తి కేరళలో 2016లో సనామ్‌ సాబూ సిద్ధిక్‌ను వివాహం చేసుకున్నారు. అనంతరం యూఏఈ వెళ్లారు. జులై, 2018లో వారికి పండంటి ఆడపిల్ల పుట్టింది. వారి వివాహం యూఏఈ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో వారు కష్టాలు పడ్డారు.

'నాకు అఅబుధాబి వీసా ఉంది. అక్కడ నేను బీమా కవరేజ్‌ను పొందాను. గర్భం దాల్చిన నా భార్యను ప్రసవం కోసం తొమ్మిది నెలల క్రితం యూఏఈలోని ఓ ఆస్పత్రిలో చేర్పించాను. నేను హిందువైన కారణంగా పాపకు జనన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడానికి వారు నిరాకరించారు. న్యాయస్థానానికి వెళ్లినప్పటికీ నేను వేసిన కేసును కొట్టివేశారు. నాకు యూఏఈలో పాప పుట్టిందనడానికి చట్టపరంగా ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆందోళన చెందాను. ఇక్కడి నుంచి వెళ్లేందుకు భారత దౌత్య కార్యాలయం మాకు సాయం చేయాలనుకుంది. అయితే, పాపకు అధికారులు ఇమ్మిగ్రేషన్‌ క్లియరన్స్‌ ఇవ్వలేదు.. మా పాప ఇక్కడే పుట్టిందనడానికి సరైన పత్రాలు లేవని స్పష్టం చేశారు' అని కిరణ్‌ బాబు మీడియాకు తెలిపారు.

ఆయన ఈ విషయంపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఈ కేసును స్వీకరించడానికి కోర్టు అంగీకరించింది. 'సహన సంవత్సరాది'గా 2019ని ప్రకటించిన సందర్భంగా తాజాగా యూఏఈ ప్రభుత్వం ఆ పాపకు జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. ఆ పాపకు అనాంత ఏస్‌లీన్‌ కిరణ్‌ అని పేరు పెట్టారు. 'తమ చరిత్రలో మొట్టమొదటి సారి నిబంధనలను పక్కకు పెట్టి మా పాపకు ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు అధికారులు నాకు తెలిపారు' అని కిరణ్‌ బాబు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com