అమెరికా వెళ్లే విద్యార్థుల కోసం యాప్‌

- May 12, 2019 , by Maagulf
అమెరికా వెళ్లే విద్యార్థుల కోసం యాప్‌

హైదరాబాద్‌: అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే వారి కోసం విద్యార్థి వీసా, విద్యా సంస్థల సమాచారాన్ని అందజేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకురానుంది. విద్యార్థి వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి. విద్యా సంస్థను ఎలా ఎంపిక చేసుకోవాలి. విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుంది. ఏయే కోర్సులకు స్కాలర్‌షిప్‌, ఫెలోషిప్స్‌ లభిస్తాయి. ఏయే విద్యా సంస్థలు అందచేస్తాయి. వీసా కోసం ఎలాంటి ధ్రువపత్రాలు కావాలి. ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. వీసా ఇంటర్వ్యూ అపాయింటుమెంటు తీసుకోవటం ఎలా? తదితర అంశాల్లో భారతీయ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేందుకు యాప్‌ను రూపొందిస్తోంది.

అమెరికాలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థులు వీసా(ఎఫ్‌-1) కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా వెళ్లే విద్యార్థులు అక్కడి కొన్ని బోగస్‌ విద్యాసంస్థల వలలో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. సరైన విద్యాసంస్థ లేదా విశ్వవిద్యాలయాన్ని ఎంచుకునేందుకు అమెరికా ప్రభుత్వం వివిధ వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్‌, రాయబార కార్యాలయం, అమెరికన్‌ కార్నర్‌ పేరిట కేంద్రాలతోపాటు వై-యాక్సిస్‌ ఫౌండేషన్‌ ద్వారా విద్యార్థులకు సలహాలు సూచనలు అందచేస్తోంది. విద్యార్థులకు మరింత చేరువయ్యేందుకు యాప్‌ను తీసుకొస్తోంది. ఇందులో అనుమతి పొందిన విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల సమాచారం ఉంచాలని నిర్ణయించింది. వచ్చే నెలలో యాప్‌ను ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయంలోని విద్యా, సాంస్కృతిక వ్యవహారాల ప్రతినిధి కారల్‌ ఆడమ్‌ మీడియా తో చెప్పారు.

400 విశ్వవిద్యాలయాలు: అమెరికాలో 400 విశ్వవిద్యాలయాలు, 4,700 విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిల్లో వివిధ దేశాలకు చెందిన సుమారు పది లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. భారత్‌ నుంచి ఏటా దాదాపు రెండు లక్షల మంది అమెరికా వెళ్లి చదువుకుంటున్నట్లు ఓపెన్‌ డోర్‌ పేరిట అమెరికా ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వారిలో 70శాతం మంది 300 నుంచి 400 విశ్వవిద్యాలయాల్లోనే చదువుతున్నారు. భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు దక్షిణాది రాష్ట్రాల్లోని చెన్నై, హైదరాబాద్‌ అమెరికన్‌ కాన్సులేట్‌ నుంచి వీసాలు పొందుతున్నట్లు కారల్‌ ఆడమ్‌ చెప్పారు. ఇక్కడి విద్యార్థులకు సూచనలు ఇచ్చేందుకు యాప్‌ను అమెరికా రూపొందిస్తోంది. అమెరికా వెళ్లే వారిలో అత్యధికులు ఈ రాష్ట్రాల వారే కావటంతో వారు ఎక్కడా మోసపోకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రయోజనకరంగా ఉందని అంచనా వేసిన తరవాత ఇతర దేశాలకూ విస్తరించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. విద్యాసంవత్సరం ఇప్పుడిప్పుడే ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే నెలలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కారల్‌ ఆడమ్‌ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com