ట్యునీసియా తీరంలో పడవ బోల్తా 65 మంది మృతి

- May 12, 2019 , by Maagulf
ట్యునీసియా తీరంలో పడవ బోల్తా 65 మంది మృతి

న్యూ యార్క్:మధ్యధరా సముద్ర తీర ప్రాంతమైన ట్యునీసియాలో వలసవాసులు, శరణార్ధులతో వస్తున్న ఒక పడవ మునిగిపోయిన దుర్ఘటనలో 65 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం నుండి 16 మందిని రక్షించినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్ధులు సంస్ధ (యుఎన్‌హెచ్‌సిఆర్‌) శుక్రవారం తెలిపింది. గడిచిన కొద్ది నెలల్లో మధ్యధరా సముద్రంలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన సంఘటనగా దీనిని అభివర్ణించింది. ''మధ్యధరా సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నించే వారికి అత్యంత విషాదకరమైన ఈ ప్రమాదం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలి పోతుంది'' అని మధ్యధరా ప్రాంత యుఎన్‌హెచ్‌సిఆర్‌ ప్రత్యేక రాయబారి విన్సెంట్‌ కోచెటెల్‌ తెలిపారు. ఈ ప్రమా దానికి సంబంధించి ఇప్పటి వరకు కేవలం నాలుగు మృత దేహాలను మాత్రమే బయటకు తీశామని, గాలింపు చర్యలు కొనసాగతున్నాయని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఓఎం) ట్వీట్‌ చేసింది. 
ట్యునీసియా అధికారిక వార్తా సంస్ధ కధనం మేరకు ఆ పడవలో దాదాపు 70 మంది శరణార్దులు, వలసవాసులు ప్రయాణిస్తున్నారు. ఎస్‌ఫాక్స్‌ తీర ప్రాంతానికి 40 నాటికల్‌మైళ్ళ దూరంలో పడవ మునిగి పోయింది. అంటే టునిషియా రాజధాని టునిస్‌కు దక్షిణంగా 270 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. 
ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఓఎం) ఈ ప్రమాదంపై వ్యాఖ్యానిస్తూ ''మధ్యధరా సముద్రంలో మరో విషాదం''గా అభివర్ణించింది. ఈ పడవలో ప్రయాణిస్తున్న వారిలో బంగ్లాదేశ్‌, మొరాకోలకు చెందిన వారితో పాటు ఇతర దేశాలకుచెందిన వారు కూడా ఉన్నారని తెలిపింది. గత ఏడాది లిబియా నుండి యూరప్‌కు వెళ్ళే మార్గంలో ప్రతి 14 మందిలో ఒకరు మృతి చెందినట్లు పేర్కొంది. 2018లో మధ్యధరా సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నిస్తూ సగటున రోజుకు ఆరుగురు మృతి చెందుతున్నట్లు నట్లు ఐక్యరాజ్య సమితి జనవరిలో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com