విశాఖపట్నం:కొత్త తరహా మోసం..

- May 13, 2019 , by Maagulf
విశాఖపట్నం:కొత్త తరహా మోసం..

విశాఖపట్నం:విశాఖలో అద్దె కార్ల స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. మాయమైన 200 కార్లలో కొన్నింటిని ఇప్పటికే పోలీసులు రికవరీ చేశారు. ఇంకొన్ని కొన్ని కార్లు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ప్రత్యక్షమయ్యాయి. అయితే వాటిని తనఖా పెట్టుకున్న ఫైనాన్షియర్లు ఇటు బాధితులకు, అటు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. విశాఖకు చెందిన అడప ప్రసాద్‌ అద్దె కార్ల పేరుతో ట్రావెల్స్ కంపెనీలకు కుచ్చుటోపీ పెట్టాడు. కార్పొరేట్‌ కంపెనీలకు కార్లు అద్దెకు కావాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. కారును అప్పగిస్తే నెలకు 25 నుంచి 40 వేల వరకు ఇస్తానని చెప్పడంతో సుమారు 10 మంది ట్రావెల్స్ కంపెనీ యజమానులు 200 కార్లను ప్రసాద్‌ కు అప్పగించారు. ఆరేడు నెలలకు సక్రమంగా అద్దె చెల్లించి అందరినీ నమ్మించాడు ప్రసాద్. ఆ తర్వాత తన అసలు రూపాన్ని చూపించాడు. అద్దెకు తీసుకున్న కొన్ని వాహనాలను కార్ల మాఫియాకు మారుపేరైన తూర్పుగోదావరి అనపర్తిలో తనఖా పెట్టాడు. 10 నుంచి 20 లక్షల విలువ చేసే కార్లను కుదువ పెట్టి 5 నుంచి 8 లక్షలు పొందాడు.

కార్ల అద్దె రాకపోవడంతో పాటు ప్రసాద్‌ కూడా పత్తా లేకుండా పోవడంతో ట్రావెల్‌ కంపెనీల యజమానులకు అనుమానమొచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసి, కార్ల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. కొన్ని అనపర్తిలో ఉన్నాయని తెలియడంతో అక్కడికి వెళ్లారు. అయితే కృష్ణారెడ్డి నేతృత్వంలోని ఫైనాన్షియర్లు కార్ల బాధితులకు, పోలీసులకు తమ ప్రతాపం చూపించారు. డబ్బులు చెల్లించి తనాఖాలో ఉన్న కార్లను తీసుకెళ్లాలని జులుం ప్రదర్శించారు.

మరోవైపు అద్దె కార్ల మాయంపై విశాఖలోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. విశాఖ జిల్లా వేపగుంట, పెందుర్తిలో సుమారు 80 కార్లను రికవరీ చేస్తామన్నారు. ప్రధాన నిందితుడు ప్రసాద్‌‌తో అతనికి సహకరించిన వారి కోసం దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. సుమారు 15 కోట్ల మేర జరిగిన అద్దె కార్ల స్కాం వెనుక అనపర్తి మాఫియా ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కార్ల మాఫియాకు చెక్‌ పెట్టి, బాధితులకు న్యాయం చేస్తామని వారు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com