అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ వార్‌..

- May 17, 2019 , by Maagulf
అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ వార్‌..

అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. ఇప్పటికే వస్తువులపై వార్ నడుస్తుండగా, ఇప్పుడు టెక్నాలజీ వార్‌కు తెరలేచింది. అమెరికన్ కంపెనీల టెక్నాలజీ ని చైనా సంస్థలు దొంగిలిస్తున్నాయని ఆరోపిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డ్రాగన్ కంపెనీలకు చెక్ పెట్టే దిశగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దేశంలో జాతీయ అత్య వసర పరిస్థితి విధించారు. విదేశీ శత్రువుల నుంచి దేశంలో కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు ముప్పు ఉన్నందున నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

నేషనల్‌ ఎమర్జెన్సీ విధించడంతో పాటు ట్రంప్ ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ హువావేపై ఆంక్షలు విధించింది. ఫలితంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎలాంటి టెక్నాలజీని కొనుగోలు చేయకూడదు. అలాగే, అమెరికా కంపెనీలకు విదేశీ టెలికం సేవలను వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నిర్ణయంపై హువావే తీవ్రంగా స్పందించింది. ఈ చర్యతో అమెరికా, చైనా మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తాము వ్యాపారం చేయకుండా అమెరికా అడ్డుకుంటే వారి వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని పేర్కొంది. తమతో వ్యాపారం చేయకుండా ఉన్నంత మాత్రాన అమెరికా భద్రంగా ఉండబోదని పేర్కొంది. ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అజిత్‌ మాత్రం ట్రంప్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. అమెరికా నెట్‌వర్క్‌ను కాపాడుకోవడానికి ఇది సరైన చర్య అన్నారు.

హువావే విషయంలో ట్రంప్ కోపానికి కారణాలున్నాయి. టెలికం రంగంలో వినియోగించే రోబో సాంకేతికతను దొంగిలించిందనే హువావేపై ఆరోపణలొచ్చాయి. హువావేకు, టి మొబైల్స్‌ కంపెనీ అమెరికాలో వ్యాపార భాగస్వామి. టి మొబైల్స్‌కు తాపీ అనే రోబో ఉంది. మొబైల్‌ఫోన్లను పరీక్షించడానికి తాపీనీ వినియోగిస్తారు. ఆ రోబో చేయి సాంకేతి కతను హువావే తస్కరించిందని సమాచారం. హువావే ఉద్యోగులు కొందరు తాపీ డిజైన్‌, కొలతలను తీసుకోవడంతో పాటు ఫొటోలను కూడా చైనాకు తరలించారనే ఆరోప ణలు ఉన్నాయి. తాపీ సమాచారం ఇచ్చిన ఉద్యోగులకు హువావే యాజమాన్యం బహుమతులు కూడా ఇచ్చిందని, ఇదంతా హువావే కనుసన్నల్లోనే జరిగిందని అమెరికా వాదిస్తోంది.

అమెరికా బ్యాంకులను మోసం చేసి ఇరాన్‌కు పరికరాలను విక్రయించినట్లు కూడా హువావేపై ఆరోపణలున్నాయి. హువావే యాజమాన్యానికి చెందిన ఓ కంపెనీ, అమెరికా టెక్నాలజీని ఇరాన్‌ మొబైల్‌ టెలికమ్యూనికేషన్‌కు విక్రయించింది. ఇందుకోసం ఆ కంపెనీ ఒక అమెరికా పౌరుడిని ఇరాన్‌లో ఉద్యోగిగా నియమించింది. ఐతే, ఆ కంపెనీతో తనకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్న విషయాన్ని అమెరికా బ్యాంకులకు హువావే వెల్లడించలేదు. ఈ వ్యవహారం మొత్తం హువావే సీఎఫ్‌వో మెంగ్‌ వాంగ్‌ఝూ కనుసన్నల్లో జరిగిందని అమెరికా భావించింది. గత డిసెంబర్‌లో ఆమెను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే మెంగ్‌ను అమెరికాకు అప్పగించే అవకాశముంది. మెంగ్‌ ఎవరో కాదు, హువావే సీఈవో రెన్‌ జెంగ్‌ఫీ కుమార్తె. చైనా కమ్యూనిస్టు పార్టీకి రెన్‌ అత్యంత సన్నిహితుడు. గతంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో కూడా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com