ఇండియా:ఇంజినీరింగ్ విద్యార్థి ఇంటర్న్‌షిప్‌ ఎలా చేస్తే..

- May 18, 2019 , by Maagulf
ఇండియా:ఇంజినీరింగ్ విద్యార్థి ఇంటర్న్‌షిప్‌ ఎలా చేస్తే..

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రకారం ఇంజినీరింగ్ చదివే ప్రతి విద్యార్థి విద్యా సంవత్సరం ముగిసేలోపు మూడు ఇంటర్న్‌షిప్‌లు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి భవితకు ఇంటర్న్‌షిప్‌లు ఎంతో మేలు చేస్తాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థికి ఉద్యోగార్హత నైపుణ్యాలు ఉండడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఈ లోపాన్ని సవరించే దిశగా ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరి చేశారు. ఇప్పటి వరకు పేరున్న కళాశాలలు మాత్రమే ఇంటర్న్‌షిప్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇక నుంచి ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల చేత ఇంటర్న్‌షిప్‌ చేయించాలి. పాసైతే చాలనుకుని పరీక్షల ముందు ఒకరోజు చదివి రాసేస్తున్నారు. దాంతో సబ్జెక్టు పట్ల విషయ పరిజ్ఞానం ఉండడం లేదు చాలా మంది విద్యార్థులకు. ఇలాంటి వారికి ఉద్యోగావకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఒకవేళ ఏదో విధంగా ఉద్యోగం సంపాదించుకున్నా సరైన ప్రావిణ్యం కనబరచకపోవడంతో మేనేజ్‌మెంట్ అలాంటి వారిని పక్కనపెట్టేస్తుంది.

ఇంటర్న‌షిప్‌లు నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది చేసిన తరువాత ఆయా కంపెనీలు ఒక నివేదికను ఇవ్వమని విద్యార్ధులను అడిగి ఆ తరువాతే వారికి సర్టిఫికెట్ ఇస్తాయి. ఈ సమాచారం ఆ కంపెనీకి సంబంధించి నిర్ధిష్టంగా ఉంటుంది కాబట్టి అది ఇంటర్నెట్‌లో లభ్యం కాదు. దాన్ని విద్యార్థి సొంతంగా చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు చేసే అకడమిక్ ప్రాజెక్టులోనూ ఈ తీరు పాటిస్తే వారి భవితకు బంగారు బాట వేసుకున్నవారవుతారు. కంపెనీలు మెరికల్లాంటి ఉద్యోగులను నియమించుకుంటేనే ఈ పోటీ ప్రంపంచంలో నెగ్గుకు రాగలుగుతాయి.
ప్రాజెక్టు ఎంపికకు ఆయా కాలేజీలలో ఉన్న ప్లేస్‌మెంట్ అధికారిని సంప్రదిస్తే కంపెనీలు కోరుకునే జాబ్ డిస్క్రిప్షన్ గురించిన వివరాలు అందిస్తారు. లేదంటే సీనియర్లను సంప్రదించినా తెలుస్తుంది. ప్రాజెక్టుకు సరైన అంశాన్ని ఎంచుకోవడానికి ఇంటర్న్‌షిప్‌లు సాయపడతాయి. కొన్ని కంపెనీలు ప్రాజెక్టు సమయంలో అవసరమైన వనరులు అందిస్తూ, ఎలా చెయ్యాలనేది దిశా నిర్ధేశం చేస్తున్నాయి. ఇలా చేసిన ప్రాజెక్టులు విద్యార్థి రెజ్యూమెకు బలం చేకూర్చి ప్లేస్‌మెంట్‌లో సెలక్ట్ అయ్యేలా చేస్తాయి.
ఇంటర్న్‌షిప్‌ చేయడానికి కాలేజీల గైడెన్స్‌తో పాటు మరో మార్గం ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ వేదికలు. వాటిలో ముఖ్యమైనవి..
https://intenshala.com, www.letsintern.com, https://skillenza.com/challenge/internhunt www.youth4work.com, www.linkedin.com
ఇంటర్న్‌షిప్‌ చేయడానికి విద్యార్థి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తర్వాత చాలా సమయం ఉంటుంది. ఈ వ్యవధిలో మొదటి ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకోవచ్చు. విద్యార్థులు జనరల్ సబ్జెక్టుల నుంచి స్పెషలైజేషన్ సంబంధ సబ్జెక్టులకు మారే క్రమంలో ఉంటారు కాబట్టి నాన్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్‌ను ఎంచుకుంటే మంచిది. ఉదాహరణకు.. అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ మొదలైనవి. ఎన్‌జీవోల దగ్గర కూడా చేయవచ్చు. అయితే మొదటి ప్రాధాన్యం మాత్రం తాము ఎందులో స్పెషలైజేషన్ చేస్తున్నారో దానికే ఇస్తే మంచిది.
ఇక రెండో సంవత్సరంలో కొంత బేసిక్స్ తెలిసి ఉంటాయి కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ అందుకు సంబంధించిన నైపుణ్యాలపై ఆధారపడిన ఇంటర్న్‌షిప్ చేస్తే మంచిది. ఈ తరహా ఇంటర్న్‌షిప్‌లను ప్రభుత్వ (బీఎస్‌ఎన్‌ఎల్, ఈసీఐఎల్, ఎల్అండ్‌టీ..), కొన్ని ప్రైవేట్ సంస్థలు అందిస్తుంటాయి. కొన్ని సంస్థల్లో ఎన్‌రోల్‌మెంట్ కోసం రూ.6,000 నుంచి రూ.10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
మూడో సంవత్సారినికి వచ్చేసరికి విద్యార్థులు కార్పొరేట్ కంపెనీలో విధులు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు తమకున్న ప్రతిభా పాటవాల ఆధారంగా ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్ చేస్తున్న విధ్యార్థుల ప్రతిభను బట్టి కొన్ని కంపెనీలు ఉద్యోగావకాశాల్ని కూడా కల్పిస్తాయి.
ఆఖరిది నాలుగో సంవత్సరం.. ఇక్కడ కొన్ని కంపెనీలు ఫైనల్ సెమిస్టర్లో ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఇందులో చక్కని ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు కొన్ని కంపెనీలు మంచి ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తాయి. ఇలాంటి విద్యార్థులకు అవకాశమిచ్చి నియమించుకుంటే తమ కంపెనీకి ప్రధాన బలంగా తయారవుతారనే నమ్మకం ఏర్పడుతుంది. సో.. ఇంజినీరింగ్ చదువుని ఈజీగా తీసుకోకుండా మొదటి రోజునుంచి ఇష్టంగా కష్టపడితే మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com