ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా.. మోదీని ఆహ్వానించనున్న జగన్‌

- May 25, 2019 , by Maagulf
ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా.. మోదీని ఆహ్వానించనున్న జగన్‌

151 సీట్లతో అఖండ విజయం సాధించిన జగన్.. పాలనాపరమైన అంశాలపై ఫోకస్ చేస్తున్నారు..23 మంత్రిత్వ శాఖలకు చెందిన 57మంది అధికారులు ఆయన్ను తాడేపల్లి నివాసంలో కలిశారు. ఆయా శాఖల వివరాలను అధికారులు వివరించారు. ఇక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించడంతో ఆ ఏర్పాట్లపైనా జగన్ సమీక్షించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను ఆదేశించారు. కనీసం 20 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని సూచించారు. మొదట విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియాన్ని ప్రమాణస్వీకార వేదికగా నిర్ణయించినప్పటికీ.. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు సూచించినట్లు సమాచారం. దీంతో చిన్నఔటుపల్లి వద్ద వేదిక ఏర్పాటు చేస్తే అన్నింటింకి బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.. 30న ఉదయం 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల మధ్య జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం…

మరోవైపు.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. జగన్ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఎల్పీ సమావేశం ముగిశాక జగన్‌ హైదరాబాద్ వెళ్లనున్నారు. గవర్నర్‌తో సమావేశమై.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతారు. అనంతరం… తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ సమావేశం కానున్నారు జగన్. తన ప్రమాణస్వీకారానికి కేసీఆర్‌ను ఆహ్వానించనున్నారు జగన్‌. మరోవైపు….26న ఢిల్లీకి వెళ్లనున్నారు జగన్‌. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా.. మోదీని ఆహ్వానించనున్నారు జగన్‌.

అటు… గవర్నర్ తో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఉదయం 11.30 గంటలకు భేటీకానున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆయన గవర్నర్‌కు అందజేస్తారు. ఆ వివరాలతో రాజపత్రాన్ని ప్రచురిస్తారు.

మరోవైపు… ఏపీ పోలీసు శాఖ జగన్‌కు సీఎస్‌వోను నియమించింది. జగన్‌ సీఎస్‌వోగా అమర్లపూడి జోషి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్‌లో జోషి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు జగన్‌ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిలోని నివాసాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాడేపల్లి ప్రాంతంలో పూర్తిగా ఆంక్షలు పెట్టారు. ఇక జగన్‌కు ప్రభుత్వం తాత్కాలిక కాన్వాయ్‌ కేటాయించింది. ఏపీ 18 పీ 3418 నంబరుతో ఆరు కొత్త వాహనాలు సమకూర్చింది.

కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు అమరావతిలోని సచివాలయం ముస్తాబవుతోంది. మంత్రిత్వ శాఖల ముందు ఏర్పాటు చేసిన నేమ్‌ బోర్డులు, ఫోటోలను తొలగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com