ఇవాళ మంత్రి వర్గ విస్తరణ.. డిప్యూటీ సీఎం పదవి ఎవరికి?

- June 16, 2019 , by Maagulf
ఇవాళ మంత్రి వర్గ విస్తరణ.. డిప్యూటీ సీఎం పదవి ఎవరికి?

మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఇవాళ జరగనుంది. ఈఎక్స్‌పాన్షన్‌ శివసేన, ఎన్డీయే మిత్రపక్షాల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండబోతుందని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ కూటమి పక్షాలను చల్లబరిచేందుకు కేబినెట్ కూర్పును కసరత్తు చేసింది. శివసేన డిప్యూటీ సీఎం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇవాళ కేబినెట్ ఎక్స్‌పాన్షన్‌ జరగనుంది. శివసేన, ఎన్డీయే మిత్రపక్షాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విస్తరణ ప్రక్రియ చేపట్టనున్నారు. కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్‌ పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేన.. రాష్ట్రంలో తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టింది.. దీంతో మంత్రిమండలి తాజా విస్తరణలో భాగంగా శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. శివసేన సీనియర్ నేత సుభాష్ దేశాయ్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అటు మంత్రివర్గ కూర్పుపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రేతో సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు శివసేనలో చేరిన NCP నాయకుడు జయదత్ కిషిర్‌సాగర్‌కు కూడా కేబినెట్‌లో చోటు కల్పిస్తారని తెలుస్తోంది.

మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న VK పాటిల్, ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కుమారుడు సుజయ్ పాటిల్ లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరిపోయారు. అహ్మద్‌నగర్ టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకత్వం నిరాకరించడంతో ఆ పార్టీకి సుజయ్ గుడ్ బై చెప్పారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈనేపథ్యంలో. సీనియర్ నాయకుడైన పాటిల్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించి వ్యవసాయశాఖను అప్పగిస్తారని సమాచారం.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వంలో శివసేన చేరింది. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉంది. శివసేనకు 63 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com