అలర్ట్..పుల్వామా తరహా దాడులు మరోసారి జరగవచ్చని హెచ్చరించిన యూఎస్, భారత ఇంటలీజెన్స్

- June 16, 2019 , by Maagulf
అలర్ట్..పుల్వామా తరహా దాడులు మరోసారి జరగవచ్చని హెచ్చరించిన యూఎస్, భారత ఇంటలీజెన్స్

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని పాకిస్థాన్‌ నుంచి హెచ్చరికలు అందాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా పేర్కొంది. పుల్వామా జిల్లాలోని అవంతిపొర ప్రాంతంలో పేలుళ్లు జరిపేందుకు ముష్కరులు యత్నిస్తున్నట్లు పాకిస్థాన్‌ నిఘా విభాగం సమాచారం అందించింది. ఇదే విషయాన్ని భారత్‌తో పాటు అమెరికాకు కూడా ఈ విషయాన్ని పాక్‌ తెలియజేసింది. వాహనానికి ఐఈడీ అమర్చి పుల్వామా తరహాలోనే రహదారిపై దాడికి పాల్పడే అవకాశం ఉందన్నారు. ఉగ్రవాది జాకీర్‌ మూసాను గత నెలలో భద్రతా బలగాలు మట్టుబెట్టినందుకు ప్రతీకారంగానే దుండగులు ఈ దాడికి యత్నిస్తున్నట్లు పాక్‌ సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలను మొహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

మే, 2017లో అల్‌ఖైదా ఉగ్రసంస్థకు అనుబంధంగా జాకీర్‌ మూసా ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ అనే ఉగ్రసంస్థను స్థాపించాడు. అయితే గత నెల త్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో మూసాని భద్రతా బలగాలు హతమార్చాయి. 2016లో హతమైన బుర్హాన్ వానీ బృందంలో మూసాయే చివరివాడని పోలీసులు తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రశిబిరాన్ని భారత వాయుసేన నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com