గ్రీన్ కార్డు బిల్లుకు గ్రీన్ సిగ్నల్

- July 11, 2019 , by Maagulf
గ్రీన్ కార్డు బిల్లుకు గ్రీన్ సిగ్నల్

వాషింగ్టన్ : అగ్రరాజ్యంలో పర్మినెంట్‌గా సెటిలవ్వాలనుకునే వారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. ఆ దేశంలో విదేశీయులు శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకునేందుకు వీలు కల్పించే గ్రీన్‌కార్డు బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఒక్కో దేశానికి ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు ఇవ్వకూడదన్న నిబంధనలతో ఎన్నారైలు తమ వంతు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కోటా పరిమితిని ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లును సెనెట్ ప్రవేశపెట్టగా దానికి సభ ఆమోద ముద్ర వేసింది.

పెండింగ్‌లో భారతీయుల అప్లికేషన్లు
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జనాభా ఎక్కువ ఉన్న దేశాలకు తక్కువ ఉన్న దేశాలకు ఒకే నిబంధన అమలవుతుండటంతో భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వలసదారుల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు గత ఫిబ్రవరిలో ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్ యాక్ట్ బిల్లును రూపొందించారు. భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హ్యారిస్, మరో ఎంపీ మైక్ లీతో కలిసి బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. 

కాంగ్రెస్‌లో బిల్లుకు మద్దతు
అమెరికా చట్టసభలోని ప్రతినిధుల సభలో 112 మంది కాంగ్రెస్ సభ్యులు మద్దతుతో ఇదే రకమైన బిల్లును జో లాఫ్గెన్, కెస్ బక్‌లు ప్రవేశపెట్టారు. గూగుల్, వాల్ మార్ట్ తదితర దిగ్గజ కంపెనీలు సైతం వీటిని సమర్థించాయి. ఎంప్లాయిమెంట్ బేస్డ్ వీసాల కింద అమెరికా ఏటా 1.4లక్షల మందికి గ్రీన్‌కార్డులు ఇస్తోంది. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం ఒక్కో దేశానికి గరిష్ఠంగా ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు కేటాయించే అవకాశం లేదు. దీంతో ఒక్కో దేశం ఏటా ఈబీ వీసాల కింద ఒక్కో దేశానికి 9,800కు మించి గ్రీన్ కార్డులను పొందే అవకాశం లేదు. 

నిరీక్షణకు తెర
హెచ్1బీ వీసాలతో అమెరికాకు వచ్చి గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఆమోదంతో మేలు జరగనుంది. ప్రస్తుతం అమలవుతున్న విధానం ప్రకారం ఇండియన్ల అప్లికేషన్లు క్లియర్ అయ్యేందుకు కనీసం 70 ఏళ్లు పడుతుందని అంచనా. అయితే తాజా బిల్లు ఒక్కో దేశంపై ఉన్న పరిమితిని సడలించడంతో భారత్, చైనా తదితర దేశాలకు భారీ ప్రయోజనం కలుగుతుంది. తాజా బిల్లులో ఫ్యామిలీ స్పాన్సర్డ్ విభాగంలో కార్డుల జారీని 15శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. తాజా బిల్లులు చట్టరూపం దాల్చడంతో గ్రీన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరలోనే ఫలించనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com