బ్రిటిష్‌ చమురు ట్యాంకర్‌ను అడ్డగించారు

- July 12, 2019 , by Maagulf
బ్రిటిష్‌ చమురు ట్యాంకర్‌ను అడ్డగించారు

టెహ్రాన్‌ : వ్యూహాత్మకమైన గల్ఫ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌ సాయుధ బోట్లు ఒక బ్రిటిష్‌ చమురు వాహక నౌకను అడ్డగించి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాయని, అయితే వారిని బ్రిటిష్‌ రాయల్‌ నేవీ ఫ్రిగేట్‌ సిబ్బంది తరిమికొట్టారని అమెరికన్‌ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. 2015 నాటి అణు ఒప్పందం నుండి ఏకపక్షంగా తప్పుకున్న అమెరికా తమపై విధిస్తున్న ఆంక్షల పట్ల ఇతర భాగస్వామ్య దేశాలు నిర్లిప్తతతో వ్యవహరిస్తుండటం ఇరాన్‌కు బాధ కలిగించింది. బ్రిటిష్‌ హెరిటేజ్‌ చమురు ట్యాంకర్‌ నౌక హోర్ముజ్‌ జలసంధిని దాటుతున్న సమయంలో ఇరాన్‌ దళాలు దానిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాయని ఇద్దరు అమెరికన్‌ అధికారులను ఉటంకిస్తూ సిఎన్‌ఎన్‌ వార్తా సంస్థ వెల్లడించింది. దానికి ఎలాంటి ఆధారాలను అది చూపలేదు. గత బుధవారం తమ చమురు నౌకను బ్రిటిష్‌ దళాలు జిబ్రాల్టర్‌ తీరంలో దిగ్బంధించటంపై మండిపడిన ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రొహానీ తమ నౌకను విడుదల చేయకుంటే 'తీవ్ర పరిణామాలు' ఎదుర్కొంటారని బ్రిటన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. బ్రిటిష్‌ చమురు వాహక నౌకను తాము అడ్డుకున్నట్లు అమెరికన్‌ మీడియా ప్రసారం చేసిన వార్తలను ఇరాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జిసి) తీవ్రంగా ఖండించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com