అనూహ్యంగా మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయం

- July 12, 2019 , by Maagulf
అనూహ్యంగా మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయం

కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామికి తాత్కాలిక ఊరట లభించింది. రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాల ఆమోదంపై సత్వర నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ అపెక్స్ కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తమ రాజీనామాలను తక్షణం ఆమోదించాలని కోరుతూ రెబెల్ ఎమ్మెల్యేలు మరోమారు కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి యధాతథ స్థితిని మంగళవారం వరకు కొనసాగించాలని ఆదేశించింది. వీరి పిటిషన్ పై మళ్ళీ విచారణ జరుపుతామని సూచించింది. వీరి రాజీనామాల విషయమై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తనకు కొంత వ్యవధి కావాలని స్పీకర్ రమేష్ కుమార్.. కోర్టును అభ్యర్థించారు.

ఆయన తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. తన క్లయింటు చేసిన వినతిలోని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌లో ఔచిత్యం లేదన్నారు. వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకోవలసిందిగా స్పీకర్‌ను కోర్టు ఆదేశించజాలదని సింఘ్వీ అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కింద.. వారి రాజీనామాలపై స్పీకరే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు.

ఇలావుండగా, రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని కోరుతున్నట్టు సీఎం కుమారస్వామి శాసన సభలో ప్రకటించారు. సభలో మెజారిటీని నిరూపించుకోవడానికి అనుమతించాలని ఆయన స్పీకర్‌ను అభ్యర్థించారు. తన ప్రభుత్వ మనుగడకు సంబంధించి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని కుమారస్వామి కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు ముఖ్యమంత్రి కుమార స్వామికి పెద్ద ఊరటనిచ్చాయని చెప్పొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com