బిగ్‌బాస్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్వేతా రెడ్డి

- July 14, 2019 , by Maagulf
బిగ్‌బాస్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్వేతా రెడ్డి

రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమ ఇంచార్జ్‌తో పాటు మరో ముగ్గురు ప్రతినిధులపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. యాంకర్‌, జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్‌బాస్‌ కార్యక్రమ ఇంచార్జ్‌ శ్యాంతో పాటు ప్రతినిధులు రవికాంత్‌, రఘు, శశికాంత్‌లపై ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు తెలిపారు.

ఆయన తెలిపిన వివరాలు ప్రకారం..జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి బిగ్‌బాస్‌ సీజన్-3కి ఎంపికైనట్లు ఏప్రిల్‌లో సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి కలవాలంటూ చెప్పడంతో బంజారాహిల్స్‌లోని ఒక ఐస్‌క్రీం షాపులో కలిసి చర్చించారు. అనంతరం మరోమారు కార్యక్రమ ప్రతినిధులు రఘు, శశికాంత్‌ ఫోన్‌ చేసి కలవాలని చెప్పారు. దీంతో ఆమె మళ్లీ శ్రీనగర్‌ కాలనీలో కలిశారు. ఇక చివరగా కార్యక్రమ ఇంచార్జ్‌ శ్యాంతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని, బిగ్‌బాస్‌లో తీసుకుంటున్నట్లు చెప్పిన నిర్వాహకులు అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించుకున్న తర్వాత ముఖం చాటేశారన్నారు. శ్వేతారెడ్డి ఫిర్యాదు చేయడంతో నలుగురుపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. 

ఈ సందర్భంగా శ్వేతరెడ్డి మాట్లాడుతూ... ‘బిగ్‌బాస్‌ అనేది మైండ్‌ గేమ్‌. అలాంటి షోలో బాడీ షేపింగ్‌లో ఎందుకు చేసుకోవాలి. బాస్‌ను ఇంప్రెస్‌ చేయాలంటే ఆకర్షణీయంగా కనిపించాలి అన్నారు. అంతేకాకుండా నా బాడీ వెయిట్‌ గురించి అసభ్యకరంగా మాట్లాడారు. బిగ్‌బాస్‌-2 రియాల్టీ షోలో గలీజు...గబ్బు చీకటి కోణం గురించి పోలీసులకు వివరించాను. ఈ కార్యక్రమ నిర్వాహకులు 150మందితో గేమ్‌ ప్లాన్‌ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంపికైన ఎవరికీ అగ్రిమెంట్లు ఇవ్వలేదు. నేను ఈ విషయాన్ని బయటపెట్టిన తర్వాత చాలామంది బయటకు వస్తున్నారు. ఇంతకీ ఆ బాస్‌ ఎవరో.... ఆ దేవుడికే తెలియాలి. ఆ బాస్‌కే తెలియాలి.’ అని అన్నారు. ఈ నెల 26 నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్‌-3కి ప్రముఖ హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున‍్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com