నకిలీ ఉద్యోగాల ఉచ్చులో 9 మంది భారతీయులు

- July 23, 2019 , by Maagulf
నకిలీ ఉద్యోగాల ఉచ్చులో 9 మంది భారతీయులు

యూఏఈ:యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నకిలీ ఉద్యోగాల ఉచ్చులో తొమ్మిది మంది భారతీయులు చిక్కుకున్నారు. ప్రకటనల్లో చూపిన రీతిగా డబ్బులు కట్టి ఇప్పుడు వీరంతా యూఏఈలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని భారత రాయబార కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. కేరళకు చెందిన తొమ్మిది మంది సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఉద్యోగ ప్రకటనలను చూశారు. ఆ ప్రకటన ఇచ్చిన ఏజెంట్‌ షఫీక్‌ను సంప్రదించారు. దుబాయ్‌లోని ఆల్‌ ఐన్, అజ్మాన్‌ ప్రాంతాల్లో ఉన్న ఓ సూపర్‌ మార్కెట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అతడు నమ్మబలికాడు. వీసా కోసం రూ.70 వేలు చెల్లించాలనడంతో అప్పులు చేసి మరీ కట్టారు. వీరందరికీ వాట్సాప్‌లో కాల్‌లెటర్‌ పంపగా అబుదాబీ వెళ్లారు. అక్కడ వాకబు చేయగా.. సదరు సూపర్‌ మార్కెట్‌ యజమాని జైల్లో ఉన్నట్లు తెలిసింది. కంగుతిన్న బాధితులు అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానం కలిగిన తమను సంప్రదించాలని కాన్సులేట్‌ తెలిపింది.
'15 రోజుల్లో యూఏఈలో ఉద్యోగం ఇప్పిస్తామన్న వాట్సప్‌ మెసేజ్‌ కేరళలో బాగా చక్కర్లు కొట్టింది. నాకు కూడా ఈ మెసేజ్‌ వచ్చింది. చాలా మంది ఆసక్తి చూపించడంతో నేను కూడా ఏజెంట్‌కు డబ్బు కట్టాను. నెల​కు రూ. 23 వేల జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తాని.. భోజనం, ఉండటానికి గది ఉచితంగా ఇస్తారని ఏజెంట్‌ చెప్పడంతో మా అమ్మ నగలను తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చాను. ఉద్యోగ జీవితం మొదలైందన్న ఆనందంతో దుబాయ్‌లో అడుగుపెట్టిన నాకు మోసపోయానని తెలిసింద'ని మలప్పురం జిల్లాకు చెందిన ఫాజిల్‌ తెలిపాడు.నవదీప్ సింగ్ సూరి(భారత రాయబారి) మాట్లాడుతూ ECR పాస్పోర్ట్ హోల్డర్లు ఉపాధి కోసం విజిట్ వీసాపై యూఏఈకి రాకూడదని సూచించారు.స్మితా పంత్ (డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్,ఎంబసీ) మాట్లాడుతూ భారతదేశంలో అక్రమ ఏజెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని తెలియజేసారు.ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు రాయబార కార్యాలయం యొక్క హాట్‌లైన్‌కు 80046342 నంబర్‌కు కాల్ చేయగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com