ఉచ్చులో ఇమ్రాన్ ఖాన్: దులిపేస్తోన్న నవాజ్ షరీఫ్ కుమార్తె

- August 06, 2019 , by Maagulf
ఉచ్చులో ఇమ్రాన్ ఖాన్: దులిపేస్తోన్న నవాజ్ షరీఫ్ కుమార్తె

ఇస్లామాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేశారా? ఇప్పటికే రెండుసార్లు సైనికపరంగా ఆ దేశంపై మెరుపుదాడులు చేసిన నరేంద్ర మోడీ.. ఈ సారి పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ చేపట్టారా? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ రాజకీయ ఉచ్చులో చిక్కుకున్నారా? దీనికోసం మోడీ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును సైతం వాడుకున్నారా? అంటే అవుననే తలాడిస్తున్నారు. ఆ తలాడించేది కూడా అల్లాటప్పా వ్యక్తులు కాదు. స్వయంగా పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్. నరేంద్ర మోడీ పన్నిన ఉచ్చులో ఇమ్రాన్ ఖాన్ చిక్కుకుపోయారని, ఆయన్ని ఏమార్చి, దృష్టిని మరిల్చి తన పని తాను చేసుకెళ్లారని ఆమె ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఘనత వహించిన తమదేశ ప్రధానమంత్రికి కనీస సమాచారం కూడా లేనట్టుందని ఎద్దేవా చేశారు.

రాజకీయ ప్రత్యర్థులు సైతం..
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తిస్తూ రూపొందించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు ఎకాఎకిన ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ గెజిట్ సైతం అప్పటికప్పుడు జారీ చేశారు. అనూహ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యావత్ దేశాన్ని క్షణంపాటు నివ్వెరపోయేలా చేసింది. మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు ప్రజలు. రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఈ చర్యను స్వాగతించారు.
 
ఆత్మరక్షణలో పాకిస్తాన్..
భారత్ లో పరిస్థితి ఇలా ఉండగా.. పాకిస్తాన్ లో దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడిపోయింది. క్రమంగా ఆజాద్ కాశ్మీర్ వైపు కూడా భారత్ అడుగులు వేయొచ్చనే ఆందోళన ఆ దేశంలో వ్యక్తమౌతోంది. రాజకీయంగా కూడా ప్రకంపనలు పుట్టించింది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్ లో ఇకపై తమ ఆటలు కొనసాగబోవనే అభిప్రాయాలు పాకిస్తాన్ లో వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. రాజకీయ విమర్శలు, ఆరోపణలు, సవాళ్లను ఎదుర్కొనేలా చేసింది. ఆయనపై రాజకీయ విమర్శల జడివాన మొదలైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) సీనియర్ నేత మరియమ్ నవాజ్.. ఘాటు వ్యాఖ్యలకు తెర తీశారు.

ట్రంప్ మధ్యవర్తిత్వం పేరుతో వల..
కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తారని అంటూ కొద్దిరోజుల కిందట ఓ వార్త అంతర్జాతీయ స్థాయిలో దావానలంలా వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ వార్త ప్రత్యేకించి- పాకిస్తాన్ లో కాక పుట్టించింది. ట్రంప్ జోక్యం చేసుకుంటారనే వార్తను కొట్టి పారేయడానికి లేదా వ్యతిరేకించడానికి ఇమ్రాన్ ఖాన్ కు ధైర్యం సరిపోలేదు. దీనికి కారణం.. ట్రంప్ అనే పేరు. ఈ వార్తలపై విమర్శలు గుప్పిస్తే ట్రంప్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంలో పాక్ ప్రభుత్వ పెద్దల్లో కనిపించింది. ఇమ్రాన్ ఖాన్ ను గందరగోళంలో పడేయడానికి, ఉచ్చులో చిక్కుకునేలా చేయడానికీ నరేంద్ర మోడీ.. ట్రంప్ పేరును వినియోగించుకున్నారని మరియమ్ నవాజ్ ఆరోపిస్తున్నారు. ఈ వలలో చిక్కుకుని, దిక్కుతోచని స్థితికి ఇమ్రాన్ ఖాన్ చేరుకున్నారని, ఆయన దృష్టిని మరల్చి నరేంద్ర మోడీ.. ఆర్టికల్ 370ని రద్దు చేశారని విమర్శించారు. దీనిపై ఆమె వరుస ట్వీట్లను సంధించారు.

భారీ ర్యాలీ..
ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా తాను త్వరలోనే ఓ రాజకీయపరమైన భారీ ర్యాలీని నిర్వహించబోతున్నట్లు మరియమ్ నవాజ్ ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిద్రలేపి, జాగృతం చేయడానికే తాను ఈ ర్యాలీని నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. పాకిస్తాన్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటైన సర్ఘోదాలో ఆమె ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. భారత్ సరిహద్దులకు దగ్గరగా ఉండే నగరం ఇది. ప్రభుత్వానికి ప్రతిపక్షాల మద్దతు ఏ మాత్రం లేదని, అందర్నీ కలుపుకొని వెళ్లకపోవడం వల్లే ఇమ్రాన్ ఖాన్ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని విమర్శించారు. తాను నిర్వహించే బహిరంగ ప్రదర్శన ప్రతిపక్షాలకు కూడా ఓ కనువిప్పు కావాలని ఆమె అకాంక్షించారు. ప్రతిపక్షాలు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com