గల్ఫ్ లో కొలువైన కేరళ , సలాలా

- February 04, 2016 , by Maagulf
గల్ఫ్ లో కొలువైన కేరళ , సలాలా

Take nothing but memories, Leave nothing but foot prints ప్రపంచంలో ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా నేను అన్వయించుకునే కొటేషన్. ఉద్యోగ నిర్వహణలో భాగంగా పలు దేశాలకి వెళ్ళాల్సి ఉంటుంది. దుబాయ్ లో పని చేస్తుండటంతో మా సంస్థకి సంభందించిన వ్యాపార కార్యకలాపాలు మధ్య ప్రాచ్యంలో ఉన్న ఒమన్ , కువైట్ , ఖతర్ , సౌదీ అరేబియా , బహ్రెయిన్ లలో విస్తరించి ఉన్నాయి. ఎక్కడికి  బిజినెస్ ట్రిప్ వెళ్ళినా స్వామి కార్యం , స్వ కార్యం రెండూ కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. ఆఫీసు పనులయ్యాక కనీసం ఒక్క రోజుని అక్కడి విశేషాలని , చారిత్రక అంశాలని తెలుసుకోవటానికి పెట్టుకుంటాను.ఈ మధ్య అలాగే ఒమన్ దేశంలో ఉన్న సలాలా అనే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది.దుబాయ్ నుండి సలాలాకి ఒమన్ ఎయిర్ తో పాటు మరికొన్ని విమాన యాన సంస్థలు నేరుగా విమానాలు నడుపుతున్నాయి. ఏప్రిల్ 5 వ తేదిన నా సహా ఉద్యోగి , తమిళుడు అయిన రాజా మహమ్మద్ తో కలిసి ఒమన్ ఎయిర్ విమానంలో బయలుదేరాం. దుబాయ్ నుండి సలాలా గంటా యాభై నిమిషాల ప్రయాణం .దుబాయ్ రెసిడెన్స్ వీసా కనుక ఉంటే గల్ఫ్ కౌన్సిల్ దేశాల్లో ఆగమానంతర వీసా తీసుకోవచ్చు. సలాలా ఎయిర్పోర్ట్ చాలా చిన్నది. ఫ్లైట్ దిగగానే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లోనే వీసా తీసుకునే సదుపాయం ఉంది. వీసా ఖరీదు 5 ఒమన్ రియాల్. ఒక ఒమాన్ రియాల్ కి మన డబ్బుల్లో 160 రూపాయలు వస్తాయి. మన రూపాయికి 100 పైసలు అయితే ఇక్కడ ఒక రియాల్ కి 1000 పైసలు. పైసల్ని బైసా అంటారు. ఒమన్ దేశం రెండు రీజియన్లుగా ఉంటుంది. ఒకటి ఒమన్ కి రాజధాని ప్రాంతమైన మస్కట్ రీజియన్ కాగా , మరోటి దోఫార్ రీజియన్. దోఫార్ రీజియన్ లోనే సలాలా పట్టణం ఉంది. ఈ రెండు రీజియన్ల మధ్య దూరం 1000 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ లోనే కార్లు అద్దెకి ఇచ్చే ఆఫీసులు ఉన్నాయి. నాకు దుబాయ్ లైసెన్స్ ఉండటంతో నేను దాదాపు అన్ని దేశాల్లోను డ్రైవ్ చెయ్యచ్చు. ఇక్కడ కార్ అద్దె రోజుకి 11 రియాల్స్. నా ఐడెంటిటీ కార్డ్ చూపిస్తే కార్ తీసుకున్నాం. సలాలా చిన్న పట్టణం కావటంతో టాక్సీ లు తక్కువే. సొంత వాహనం ఉంటేనే తిరగటానికి సౌకర్యంగా ఉంటుంది. ఆ రోజు బాగా ఆలస్యం అవటంతో ముందుగానే బుక్ చేసుకున్న సంహారం విలేజ్ అనే బీచ్ రిసార్ట్ కి వెళ్ళిపోయాం. ఇది ఎయిర్పోర్ట్ కి 11 కిలోమీటర్ల దూరంలో 100 ఎకరాల విస్తీర్ణంలో సముద్రపు ఒడ్డున నిర్మించిన రిసార్ట్. ఎవరి విల్లా వారికి ప్రత్యేకంగా నిర్మించబడి ఉంటుంది.మేము ఆ ఆవరణలోకి వెళ్ళగానే రాత్రి పూట సముద్రపు హోరు భీకరంగా వినిపిస్తోంది. మరుసటి రోజు ఉదయం ఇద్దరం ఆఫీసు పనులన్నీ చక్కబెట్టుకుని అక్కడ ఉన్న విశేషాలని చూడాలని బయలుదేరాం. మేము అక్కడ కలుసుకున్న కొందరు వ్యక్తుల ద్వారా తెలుసుకున్న సమాచారం కూడా మా పర్యటనకి ఉపకరించింది. 


సాధారణంగా గల్ఫ్ దేశాలనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎడారి , ఖర్జూరపు తోటలు మాత్రమే. నీరు, వ్యవసాయం, పళ్ళ తోటలు, కొబ్బరి చెట్లు, తాజా కూరగాయలు అనేవి మచ్చుకైనా కానరావని అందరం భావిస్తాం. ఎడారి దేశాల మధ్యలో కొలువై ఉన్న ఒమన్ దేశం ఇందుకు మినహాయింపు. మన దేశంలో పండినట్లు గానే ఇక్కడ అన్ని రకాల పండ్లు కూరగాయలు పండుతాయి. ఏరోజుకారోజు పండిన తాజా పండ్లు కూరగాయలన్నీ చుట్టుపక్కల దేశాలైన సౌదీ అరేబియా , దుబాయ్ , కువైట్ , బహ్రెయిన్ లకి ఎగుమతి చేస్తుంటారు. ఒమన్ దేశం గల్ఫ్ ప్రాంతం మొత్తానికి వ్యవసాయ రాజధాని అనే చెప్పాలి. మస్కట్ తో పోలిస్తే సలాలా ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రత లు నమోదు అవుతాయి. అందుకే ఈ  ప్రాంతం గల్ఫ్ దేశాల్లో నివసించే వారందరికీ వేసవి విడిది. జూలై నుండి సెప్టెంబర్ వరకు మధ్య ప్రాచ్యంలో ఉన్న ఎడారి దేశాలు సూర్య భగవానుడి ప్రతాపంతో భగ భగ లాడి పోతుంటే వాటి మధ్య ఉన్న సలాలా మాత్రం వర్షపు చినుకులతో , పచ్చటి కొండలతో చల్లదనాన్ని పంచుతుంది. అందుకే సౌదీ అరేబియా , కువైట్ , దుబాయ్ ,ఖతర్  దేశస్థులంతా ఆ రెండు నెలల్లో సలాలా కి క్యూ కడతారు. ఈ సీజన్ ని ఖరీఫ్ అంటారు. నగరమంతా పచ్చటి కొండలతో , కొబ్బరి తోటలతో సన్నగా పడే చినుకులతో నయనాందకరంగా ఉంటుంది. వర్షం ఎరుగని అరబ్బులకి ఇది నడి వేసవి లో ఒయాసిస్సు లాంటిది.

మాకు బాగా ఆసక్తిని కలిగించిన అంశం , ఇక్కడ ఉన్న ఒక భారతీయ రాజు సమాధి. క్రీస్తు శకం 6 వ శతాబ్దంలో కేరళకి చెందిన చేరామన్ పెరుమాళ్ అనే రాజు భారతదేశంలో తొలిసారి ఇస్లాం స్వీకరించిన వ్యక్తి . ఇస్లాం మతపు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ నబీ ని కలుసుకోవటానికి భారత దేశం నుండి మక్కాకి పయనమయ్యాడు. తిరుగు ప్రయాణంలో సలాలా మీదుగా భారతదేశానికి వస్తుండగా అస్వస్థతకి గురై అక్కడే మరణించాడు. ఇస్లాం మతంలోకి మారాక తన పేరుని తాజుద్దీన్ గా మార్చుకున్నాడు. తన మాతృ ప్రాంతమైన కేరళలోనే తనువు చాలించాలనేది ఆయన కోరిక.  అది సాధ్యం కాకపోవటంతో తను చనిపోయిన ప్రాంతాన్నే అల్లా కేరళలా మార్చాడని కొందరి విశ్వాసం. చేరమాన్ సమాధి కూడా విశాలమైన కొబ్బరి , అరటి తోటల మధ్యలో ఉంటుంది. 1300 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సమాధి ఇప్పటికీ అలాగే ఉంది. ముందుగా ఈ సమాధి చూడటానికి వెళ్లాం. అసలు ఆ ప్రాంతంలో ఉన్నంత సేపు మేము కేరళలో ఉన్న అనుభూతే కలిగింది.ఆ తోటలన్నిటినీ సంరక్షించేది కూడా ఎక్కువ మలయాళీ లే. ఈ రోడ్డు వెంబడి కొబ్బరి కాయలు , కూరగాయల దుకాణాలు వరుసగా ఉన్నాయి. 

ఈ సమాధికి కొద్ది దూరంలోనే యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశం ఉంది. దీనిని Land of Frankincense అంటారు. క్రీస్తు పూర్వం 6000 ఏళ్ల క్రితం మానవులు నివసించిన నగరం అది. దాదాపు 19 ఎకరాల్లో ఉన్న ఈ ప్రదేశంలో వేల ఏళ్ల క్రితం మానవులు నివసించిన గుర్తులు ఉన్నాయి. 2000 వ సంవత్సరంలో ఈ ప్రదేశాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ ప్రదేశం చుట్టూ జల వలయం ఉంటుంది. బోటు లో విహారం చేస్తూ అక్కడి పక్షుల అందాల్ని ఆస్వాదిస్తూ ఈ ప్రాంతం చూడవచ్చు లేదంటే బాటరీతో నడిచే కార్లలో అక్కడి గైడ్ లు ఈ ప్రాంతాన్ని అంతా చూపిస్తారు. బాటరీ కార్ లో వెళ్ళాలంటే ప్రవేశ రుసుము 1 రియాల్.మేము బాటరీ కారులోనే ఆ ప్రాంతం అంతా చూశాము. అన్నేళ్ల క్రితం రాతి నిర్మాణాలు చూస్తుంటే నిజంగా అద్భుతం అనిపించింది. ఈ ప్రాంతం అంతా అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఇక్కడి నుండి నావల ద్వారా వాణిజ్యం జరిగేదట. 13 వ శతాబ్దపు ఆసియా యాత్రికుడు ఇబ్న్ బతుతా ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు అక్కడి గైడ్ చెప్పాడు. ఈ ఆవరణలోనే ఈ ప్రాంతంలో దొరికిన వస్తువులతో ఏర్పాటు చేసిన మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంకి కూడా ప్రవేశ రుసుము 1 రియాల్. మ్యూజియం లోపల ఫోటోలు నిషేధం , అక్కడ పురాతన వస్తువులతో పాటు పురాతన ఒమాన్ విశేషాలు, పలు విలువైన ఫత్వాల నకళ్ళు , ఆధునిక ఒమాన్ నిర్మాణ విశేషాలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని కలిపి Al Baleed Archaeological Park అంటారు. 

మా తరువాతి గమ్యం Mughsail. సలాలా లో ప్రసిద్ధి చెందిన పిక్నిక్ స్పాట్ ఇది ఇక్కడ గుహలతో పాటు వాటిని ఆనుకుని బీచ్ ఉంటుంది. ఆ బీచ్ లో అలల తాకిడి కి గుహ ఉన్న రాతి ప్రాంతం అడుగు భాగం అంతా కోసుకుపోయింది. అలలు ఆ రాళ్ళని తాకినపుడల్లా భయంకరమైన శబ్దంతో పాటు ఫౌంటెన్ లాగా నీళ్ళు పైకి విరజిమ్ముతాయి.ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బ్లో హోల్ అంటారు. గుహల దగ్గరనుండి సముద్ర తీరం వరకు చెక్కలతో నిర్మించిన వంతెన ఉంటుంది. సందర్సకులంతా అక్కడ నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. సలాలా కి 35 కిలోమీటర్ల దూరంలో ఈ ముఘసైల్ గుహలు ఉన్నాయి. ఇక్కడ తీరప్రాంతమంతా రమణీయంగా ఉంటుంది. 

మేము చూసిన మరో ముఖ్య చారిత్రిక ప్రదేశం  సలేహ్ ఒంటె కాలి ముద్రల ప్రాంతం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించే తెగలు ఒక చోట దొరికే నీటిని వాడుకునే వారు. ఈ సందర్భంలోనే ఆ నీటి కోసం రెండు తేగల మధ్య కొట్లాటలు జరిగేవి. అప్పుడు దేవదూతగా పంపబడిన సలెహ్ అనే ప్రవక్త వారి మధ్య గొడవల్ని పోగొట్టటానికి అక్కడున్న పర్వతాల నుండి ఒంటె ని సృష్టించాడు. రెండు పర్వతాల మధ్య నుండి అకస్మాత్తుగా వచ్చిన ఆ ఒంటె ని చూసి ప్రజలంతా ఆశ్చర్య పోయారు. ఇది దేవుడు పంపిన జంతువు అని చెప్పి దీనిని ఎవరూ ఏమి చెయ్యవద్దు అని చెప్పాడు. రోజు విడిచి రోజు అక్కడి ప్రజలంతా ఆ ఒంటెతో పాటు ఆ నీటిని వాడుకునే విధంగా ఒప్పందం కుదిరింది. అంటే ఒక రోజు ఒంటె ఆ నీటిని తాగితే మరుసటిరోజు ప్రజలు ఆ నీటిని వాడుకోవాలి. కొంతకాలానికి వారిలో కొన్ని తెగలకి ఈ ఒప్పందం నచ్చలేదు. మనకే నీటికి లేక కట కట లాడుతుంటే మధ్యలో ఈ ఒంటె ఏమిటని భావించి ఆ ఒంటె ని చంపేశారు. మరుక్షణమే ఆ ప్రాంతమంతా భూకంపం వచ్చి అంతా నాశనం అయిపొయింది. సలెహ్ ని ఎవరైతే నమ్మి ఆ ఒంటె ని అంగీకరించారో వారు మాత్రమె మిగిలారు. మిగతా వాళ్ళంతా ఆ వినాశనానికి బలయ్యారు. ఆ ఒంటేని చంపినప్పుడు దాని కాలి గురుతులు మరియు రక్తం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రాంతం చుట్టూ ఒక బిల్డింగ్ ని నిర్మించి సందర్శక ప్రాంతంగా మార్చారు. ఇది ఎప్పుడు జరిగిందో ఎక్కడా ఆధారం లేదు. ఈ వృత్తాంతం ఖురాన్ లో కూడా ఉంది. 

ఒకప్పుడు సలాలా ప్రాంతం  ప్రస్తుత యెమెన్ దేశంలో ఉండేది. యెమెన్ రాజ సంతతి కి చెందిన యువతిని ఒమన్ రాజు వివాహమాడటంతో నజరానా గా సలాలాని ఒమన్ రాజు కి ఇచ్చారు. 1932 నుండి 1970 వరకు సలాలా నే ఒమాన్ కి రాజధాని. ఒమన్ పూర్తి స్థాయి రాచరిక వ్యవస్థ ఉన్న దేశం 1970 నుండి సుల్తాన్ అల్  ఖబూస్ ఈ రాజ్యానికి రాజు. ఈయనే రాజధానిని సలాలా నుండి మస్కట్ కి మార్చాడు. అయితే సలాలా లో కూడా ఈయన నివాస భవనం ఉంది. ఈయన హయాంలోనే ఈ దేశం ఎంతో ప్రగతిని ఆధునికతని సంతరించుకుంది.ఈ దేశపు స్థానికులు అన్ని పనులలోను మనకి కనిపిస్తారు.ఇక్కడ మొత్తం జనాభా 40 లక్షలు కాగా అందులో స్థానికులు 23 లక్షల మంది. మిగతా వారంతా ఇండియా , పాకిస్తాన్ , బంగ్లాదేశ్ నుండి వలస వెళ్ళిన వారు. వీరిలో సింహ భాగం భారతీయులదే. అయితే ఇక్కడ టాక్సీలు మాత్రం స్థానిక ఒమనీ లు మాత్రమే నడపాలి. వలస కార్మికులకి ఇక్కడి ప్రభుత్వం టాక్సీ లైసెన్స్ ఇవ్వదు. మిగతా అన్ని గల్ఫ్ దేశాల్లోనూ భారతీయులు , పాకిస్తానీ లతో పాటు బంగ్లాదేశ్ వాసులు ఎక్కువగా టాక్సీలు నడుపుతారు. 

ఈ జ్ఞాపకాలన్నీ మూటకట్టుకుని మా రెండు రోజుల పర్యటనని ముగించుకుని దుబాయి కి పయనమయ్యాం. 

--రాజేష్ వేమూరి(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com