ఎప్పుడూ గల్ఫ్ వ్యధలేనా , మన విజయగాధల్నీ, ఇక్కడ అద్భుతాల్ని చూడండి

- February 11, 2016 , by Maagulf

 

 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దుబాయి అనేది భాగస్వామ్య దేశం. 1972 లో బ్రిటీషు వారి ఏలుబడి నుండి స్వతంత్రంగా ఆవిర్భవించిన ఏడు ప్రాంతాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అవే దుబాయ్,అబుధాబి,అజమాన్,షార్జా,ఉమ్ ఆల్ కోయిన్,ఫ్యుజేరా, రస్  అల్ ఖైమా. ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. ​

ఈ ఏడు దేశాలకి ఏడుగురు రాజులు ఉంటారు. స్థానిక పాలనలో ఎవరికి వారే స్వతంత్రంగా ఉన్నా, వీసా లు, విదేశీ సంభంధాల విషయాల్లో ఇవన్నీ కలిపి ఒకే దేశంగా పరిగణించబడతాయి.యు ఎ ఈ రాజధాని అబుధాబి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం దుబాయ్.

1962 లో అబుదాబి నుండి తొలిసారిగా ఆయిల్ ని ఎగుమతి చేసారు. ఇక అక్కడినుండి ఈ దేశాల భవిష్యత్తే మారిపోయింది. దేశాన్ని ఒక ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చెయ్యటం మొదలైంది.మొదట్లో పెట్టుబడిదారుల్ని, సంస్థల్ని ఆహ్వానించటం ద్వారా ఈ దేశాలకి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత మౌలిక సదుపాయాల రంగం, పర్యాటక రంగం ద్వారా పశ్చిమ దేశాల దృష్టిని కూడా ఆకర్షించింది. ఇక్కడ అసలు టాక్స్ అనేది లేదు. ఎన్ని వస్తువుల్ని తయారు చేసినా, అమ్ముకున్నా, కొనుకున్నా మన సంపాదన ఎన్ని కోట్లున్నా ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించక్కర్లేదు. అందుకే ఇక్కడ పెట్టుబడి పెట్టగలిగితే వ్యాపారం చాలా సులువు. ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది.  ​

అబుధాబి రాజు చక్రవర్తి అయితే, మిగతా వాళ్ళంతా సామంత రాజులన్న మాట. ప్రజాస్వామ్యానికి ,రాచరికానికి మధ్య ఉన్న అంతరం ఇక్కడ  ప్రస్ఫుటం గా కనిపిస్తుంది.ఇక్కడ రాజు సర్వాధికారి. అలా అని ఒంటెత్తు పోకడలు ఇక్కడ కనిపించవు. లౌకిక వాదం, జాతీయ వాదం, అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో లాగే ఇక్కడ కూడా కనిపిస్తాయి. తాగే నీరు అనేది మచ్చుకైనా కాన రాని ఆ ఇసుక ఎడారుల్లో బంగారాన్ని పండించగలమని నమ్మిన వారి ధైర్యానికి హాట్స్ ఆఫ్ అనిపించింది."The spirit of human celebration" అనేది దుబాయ్ కి ఉన్న బిరుదు. ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడం Burz khaleefa ( 830 మీటర్లు ) ఇక్కడే ఉంది. అభివృద్ధి వేగం పుంజు కోవటానికి సమిష్టి కృషి అవసరం. కానీ నిర్ణయాధికారం సమర్ధుడి చేతిలో ఉన్నపుడు ఇక ఆ అభివృద్ధి కి ఆకాశమే హద్దు, ఈ బిల్డింగ్ లానే. దాదాపు 10 సంవత్సరాల పాటు శ్రమించి సముద్రాన్నే ఖర్జూర చెట్టు ఆకారంలో పూడ్చి ఒక  పెద్ద నగరాన్నేలక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన అధ్బుతం Palm Jumeriah దుబాయి లోనే ఉంది. మన దేశంలో ఉన్న బాలీవుడ్ స్టార్స్ కి క్రికేటర్లకి ఇందులో ఇళ్ళు ఉన్నాయి. 

దుబాయ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ప్రపంచంలోనే తొలి 7 స్టార్ హోటల్ Burz Al Arab. సముద్రం మధ్యలో జుమేరా బీచ్ లో నిర్మించిన ఈ హోటల్ లో ఒకరోజు బస చేయాలంటే లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టాలి. Shindaaga టన్నెల్ అనేది మరో అద్భుతం. 1975 లోనే ఈ సముద్రం అడుగున టన్నెల్ నిర్మించారు. అంటే పైన సముద్రం ఉంటే,కింద టన్నెల్ గుండా వాహనాలు ప్రయాణిస్తాయి. దీనికి దగ్గరలోనే దుబాయ్ మ్యూజియం ఉంది. ఒకప్పుడు దుబాయ్ ఎలా ఉండేది అనే విశేషాలని, ఒకప్పటి ఇళ్ళు, అప్పటి మనుషుల్ని యధాతధంగా అక్కడ ప్రదర్శనకి ఉంచారు. 

 

ఇక్కడ మెట్రో ట్రైన్ లో డ్రైవర్ ఉండడు, అన్ని రైళ్ళు కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారానే నడుస్తాయి. ఎక్కడా చిన్న ప్రమాదం కాని, ఆగిపోవటం కాని ఉండదు. ప్రతి కిలోమీటర్ కి ఒక స్టేషన్ ఉంటుంది. మెట్రో స్టేషన్లు అన్ని రోడ్లకి దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువమంది ప్రజలు మెట్రోని వినియోగిస్తారు.

 ​ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఖరీదు. ఆ డబ్బుతో ఒక సెకండ్ హాండ్ కార్ కొనుక్కోవచ్చు.మన దగ్గర ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ ని పాటించని వాళ్ళంతా ఇక్కడ మాత్రం చాలా పద్దతిగా డ్రైవ్ చేస్తారు. రోడ్లన్నీ రాడార్ తో అనుసంధానించి ఉంటాయి. ఎక్కడ ట్రాఫిక్ ని ఉల్లంఘించినా, వేగ పరిమితికి మించి కార్ నడిపినా మనం ఇంటికేల్లెలోపు చలాన్ వచ్చేస్తుంది. ఆ ఫైన్ కట్టాలంటే కొన్ని సార్లు నెల సంపాదన కూడా చాలదు. అందుకే ఎంత ట్రాఫిక్ ఉన్నా అందరూ పద్దతిగా వెళతారు. ఇక్కడ పోలీసులంటే సేవకులుగానే పరిగణిస్తారు. ప్రజలతో మమేకమై ఉంటారు.అరబీ భాషలో సుల్తా అంటే పోలీస్. 

 

ఇక్కడున్న మరో ఆకర్షణ Desert Safari ఎత్తైన ఇసుక కొండలపైకి రక రకాల విన్యాసాలతో ప్రయాణం చెయ్యచ్చు. దీనికి ప్రత్యేక వాహనాలు ఉంటాయి.ఒక్కోసారి పడిపోతామేమో అనే భయం కూడా వేస్తుంది. భోజనం వినోద కార్యక్రమాలన్నీ ఈ డెసర్ట్ సఫారి తో పాకేజిగా అందిస్తారు.  

 

ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా ఎత్తు 830 మీటర్లు. మొత్తం అంతస్తులు 160. ఒక్క నిమిషం కంటే తక్కువ సమయంలోనే 80 వ అంతస్తు చేరుకోగల హై స్పీడ్ లిఫ్ట్ లు ఈ భవనంలో ఉన్నాయి. సందర్శకులని 124 వ అంతస్తు వరకు అనుమతిస్తారు.2004 లో దీని నిర్మాణం ప్రారంభించారు. ఆరు సంవత్సరాలు 7500 మంది కార్మికులు శ్రమించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మొదట ఈ నిర్మాణం పేరు బుర్జ్ దుబాయ్.తరువాత అబుధాబి రాజు ఖలీఫా పేరుని దీనికి పెట్టారు. 2009 లో దుబాయ్ నిర్మాణం రంగంలో వచ్చిన తిరోగమనం వల్ల ఈ భవన నిర్మాణానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు అబుధాబి రాజు ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలవటంతో దానికి కృతజ్ఞతగా ఈ నిర్మాణానికి ఆయన పేరు పెట్టారు.

 ​దీనిని ఆనుకునే దుబాయి మాల్ ఉంది. ప్రపంచంలోనే ఒకానొక పెద్ద మాల్ ఇది. ఇందులో ఉన్న ఆక్వేరియం చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆక్వేరియం గా గిన్నిస్ రికార్డు కెక్కింది. వేలాది రకాల సముద్ర జీవుల్ని ఒకే చోట చూడచ్చు. సాయంత్రం 5 గంటలకి సందర్సకులంతా ఈ మాల్ వెనకున్న మ్యూజికల్ ఫౌంటెన్ వద్దకి చేరుకుంటారు. ఒక పక్క బుర్జ్ ఖలీఫా మరోపక్క దుబాయ్ మాల్ మధ్యలో ఈ ఫౌంటెన్ మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ​

 

కేవలం ఆకాశ హార్మ్యాలు, ఖరీదైన కార్లు, లగ్జరీ హోటల్స్ మాత్రమే అభివృద్ధి కి కొలమానం కాదు.ఇక్కడా పేదలున్నారు, కానీ రాజు వారికి అవసరమైన భ్రుతిని అనేక రూపాల్లో అందిస్తాడు.దాదాపు 80 లక్షల జనాభా ఉన్న UAE లో అక్కడి పౌరులు కేవలం 10 లక్షల లోపే. సింహభాగం భారతీయులదే, దాదాపు 40 లక్షలమంది మన దేశపు పౌరులు ఆక్కడ నివసిస్తున్నారు. ఏజెంట్ ల చేతిలో మోసపోయి సరైన అవగాహన లేక ఇక్కడ జైళ్లలో మగ్గుతున్న అమాయకుల కధలనే మనం మీడియాలో చూస్తుంటాం. కానీ ఆక్కడ మన భారతీయులు పొందిన ఉన్నత స్థానాల గురించి సాధించిన విజయాల గురించి మాత్రం వినేది తక్కువే. ఇవన్నీ నాణానికి మరో వైపు.సాఫ్ట్ వేర్ మరియు ఇంజనీరింగ్ రంగాల్లో మన వారు అనేక ఉన్నత స్థానాల్లో ఉన్నారు.  ఇక్కడి రిటైల్ వ్యాపారాల్లో మలయాళీలదే హవా.ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుండే కేరళ ప్రాంతం నుండి ఇక్కడకి వచ్చి చాలామంది స్థిరపడ్డారు. పేరొందిన సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ వారివే.  తెలుగు వారు దాదాపు 4 లక్షలమంది వరకు ఉంటారు.తెలుగు లలిత కళాసమితి, రసమయి,వేవ్ , తెలుగు స్రవంతి లాంటి పదికి పైగా స్వచ్చంద సంస్థలు ఇక్కడ తెలుగు భాష, సంస్కృతి కాపాడటానికి కృషి చేస్తున్నాయి.  

 ​ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు నివసించినా మనకి ఈ దేశపు సభ్యత్వం రాదు. ఇక్కడి స్థానికులని ఎమిరాతిలు అంటారు.వాళ్ళ లాగే మనం కూడా ఇక్కడ ఇళ్ళు కొనుక్కోవచ్చు. ఒక్క షార్జా మరియు ఫుజేరా లలో మాత్రమే గల్ఫ్ కౌన్సిల్ దేశాల వారు తప్ప ఇతర దేశస్తులు ఆస్తులు కొనుక్కోవటానికి లేదు.

 

 గడచిన సంవత్సరంలో లో దాదాపు ఐదు కోట్ల మంది దుబాయ్ ని సందర్శించారని అంచనా. 2020 లో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ కి ఆతిధ్యం ఇవ్వనుంది దుబాయ్. దానికోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడు సంవత్సరాల తరువాత జరగబోయే కార్యక్రమానికి ఇప్పట్నుంచే ప్రణాళికా బద్ధంగా ముందుకి వెళ్ళటం వీళ్ళకున్న ముందు చూపుకు నిదర్శనం.దుబాయ్ కి దగ్గరగా ఉన్న దేశం షార్జా. దుబాయ్ తో పోలిస్తే ఇక్కడ ఇంటి అద్దెలు చాలా తక్కువ. అందుకే చాలామంది షార్జా లో నివాసం ఉంటూ దుబాయ్ లో పని చేస్తుంటారు. అందుకే ఉదయం సాయంత్రం వేళల్లో దుబాయ్,షార్జా రోడ్డు మీద అతి పెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అన్నిటికీ కొంచెం దూరంగా ఉన్న ప్రాంతం అబుధాబి.

 

భగవంతుడి సృష్టి తో పోటీ పడి నిర్మించే ఈ అధ్బుత నిర్మాణాలు, ఆకాశ హర్మ్యాలు,తమ దేశాన్ని అగ్రపధాన నిలపాలనే తపన, ప్రజలకి మెరుగైన రవాణా సౌకర్యాలు, ఇవన్నీ కేవలం రాజు సర్వాధికారి కావటం వల్లే సాధ్యం అయ్యాయనిపిస్తుంది. అలా అని నియంతృత్వాన్ని నేను సమర్ధించట్లేదు. ఒకప్పుడు నాగరికత తెలియని,కనీసం తినటానికి తిండి లేని ప్రజలున్న ఈ దేశాలని, చొరవ, ధైర్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఇప్పుడు రాజులుగా పిలవబడుతున్న పాలకులు ఈ స్థితికి తీసుకురాగలిగారు. కొన్ని ఇతర దేశాల్లో రాజులు స్వచ్చందంగా రాజరికం నుంచి తప్పుకుని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పితే, మరి కొన్ని దేశాలు మాత్రం ఇంకా రాచరికపు పాలనలో నే ఉన్నాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, నాగరికత కలిగిన దేశాలు 50 సంవత్సరాల్లో సాధించలేని ప్రగతిని, ఈ దేశాలన్నీ అతి కొద్దికాలంలోనే సాధించాయంటే కారణం ఇప్పుడున్న రాజులే. తిరుగుబాటు ధోరణి ఒక్క రాచరికంలో మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలోనూ ఉంది. దానికి నిదర్శనం గడచిన 65 సంవత్సరాల్లో మన దేశంలో జరిగిన మధ్యంతర ఎన్నికలు, అధికార మార్పిడులు. కానీ ప్రజాస్వామ్యం లో అవన్నీ గౌరవ ప్రదంగా మెజారిటీ ప్రజల ఆమోదంతో జరుగుతాయి. ఇక్కడ పాలకుల్ని ప్రజలు ప్రేమిస్తారు, అదే విధంగా పాలకులకి తమ ప్రజలన్నా, తమ దేశం అన్నా ఎంతో ప్రేమ, దుబాయ్ రాజు ఒక సామాన్యుడిలాగే షాపింగ్ మాల్ లో తిరుగుతూ ఉంటాడు. ఎటువంటి హంగామా కాని సెక్యూరిటీ కాని ఉండదు.

 ​ ఇక్కడ అభివృద్ధి అంతా జెట్ స్పీడుతో జరిగిపోతుంటుంది. ఎందుకింత త్వరగా అన్నీ చేస్తారు అని ఒక అంతర్జాతీయ న్యూస్ ఛానల్ విలేకరి దుబాయ్ రాజు ని ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం ఈ దేశంలో ప్రజలని ముగ్ధుల్ని చేసింది.

 

 ఆ సమాధానం ఇది. 

--రాజేష్ వేమూరి(దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com