నా ఐరోపా యాత్ర - I

- February 18, 2016 , by Maagulf

రచయిత గురించి

 

కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించారు.స్కూల్ వరకు అక్కడే చదివారు.కాలేజి విద్యాభ్యాసం అంతా హైదరాబాదులోనే. ప్రింటింగ్ టెక్నాలజీ లో పట్టబద్రులు.చదువు పూర్తయిన అనంతరం దుబాయ్ లో 2 సంవత్సరాలు పనిచేశారు. తదనంతరం ఐదేళ్ళ పాటు హైదరాబాదులోని ప్రముఖ ముద్రణాలయంలో ఉద్యోగం.ఈ ట్రావెలాగ్ రాసిన సమయం అంతా పోలాండ్ లో ఉన్న ప్రముఖ బహుళజాతి కంపెనీ లో Product development Manager గా పని చేశారు. ప్రస్తుతం దుబాయ్ లో ని ఓ ప్రముఖ పాకేజింగ్ సంస్థలో బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. చారిత్రక విషయాలన్నా, కొత్త ప్రదేశాలన్నా ఎంతో ఆసక్తి. ఐరోపా యాత్ర తో పాటు ఆయన సందర్శించిన పలుదేశాల చారిత్రక విశేషాలు ట్రావెలాగుల రూపంలో ఆంధ్రజ్యోతి,ఈనాడు,ప్రజాశక్తి పత్రికల్లో వ్యాసాలుగా వచ్చాయి. అంతేకాకుండా జన్మించిన ఊరి మీద అభిమానంతో 2010 జనవరిలో మిత్రుల సహకారంతో www.managhantasala.net అనే వెబ్ సైట్ ని స్థాపించారు.దానికి ఎడిటర్ గా ఆ గ్రామ చరిత్రనంతా ఆ వెబ్ సైట్ లో పొందుపరచటంతో పాటు ప్రతి రోజూ వారి గ్రామ వార్తలని విశేషాలని వెబ్ సైట్ లో పంచుకుంటూ ఉంటారు.తద్వారా ఆ గ్రామం నుండి విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులకి , అలాగే ఊరికి దూరంగా ఉన్న ఆ గ్రామస్థులకి ఒక వారధిగా ఈ వెబ్ సైట్ ఉపయోగపడుతోంది.

 

-మా గల్ఫ్ బృందం- 

 

నా ఐరోపా యాత్ర - I

జీవితంలో కొన్ని అనుకోని అవకాశాలు మన జీవన గమనాన్నే మార్చేస్తాయి. సంవత్సరానికి కేవలం 2830 రూపాయలు ఫీజు కట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న ప్రింటింగ్ టెక్నాలజీ చదువు నన్ను ఈ ప్రపంచంలో 12 దేశాల్లో పర్యటించటానికి దోహదం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. చదువు పూర్తీ చేసుకున్న ఏడాది లోనే దుబాయ్ వెళ్ళే అవకాశం రావటం జీవితంలో పెద్ద మలుపు. నా ఆలోచనల పరిధి అమాంతంగా పెరిగిపోవటానికి ఆ అవకాశం మరియు అక్కడ పనిచేసిన రెండు సంవత్సరాల కాలం ఎంతో ఉపయోగపడింది.బయటనిలబడి చూస్తుంటే భారతదేశం అప్పటిదాకా తెలియని కొన్ని కొత్త అంశాలని తెలుసుకునేలా చేసింది. విభిన్న మతాలు, సంస్కృతులు, భాషలు, మన దేశంలోనే నాకు తెలియని ఎన్నో విశేషాలు అక్కడే తెలిసాయి. మధ్య ప్రాచ్యం లో ఉన్న రాచరికం,చమురుతో సుసంపన్నం అయిన ఆ దేశాలు అతిత్వరగా అభివృద్ధి చెందటానికి గల కారణాలని అధ్యయనం చేసే వీలు చిక్కింది.తరువాత హైదరాబాదులోనే ఉద్యోగం రావటంతో ఇండియాకి తిరిగివచ్చి ఉద్యోగం చేస్తూనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఇంజినీరింగ్ పూర్తీ చేశాను.పనిచేస్తున్న సంస్థలో సంతృప్తిగానే సాగుతుండటంతో ఇక వేరే చోటకి వెళ్ళాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. పోలాండ్ లో మేనేజర్ గా అవకాశం ఉంది, మీకు ఆసక్తి ఉందా ? అంటూ ముంబై నుండి వచ్చిన ఫోన్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. కాని నేను మొదట చెప్పిన సమాధానం నాకు ఆసక్తి లేదు అని. అసలు పోలాండ్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. మళ్లీ రెండోసారి కాల్ చేసి మంచి ఆఫర్ అని చెప్పటంతో సరే చూద్దాం అని ఇంటర్వ్యూ కి వెళ్ళటం వెంటనే సెలెక్ట్ అవటం జరిగిపోయాయి. పోలాండ్ యూరోపియన్ యూనియన్ లో భాగం కావటంతో నేను అక్కడి పనిచేసిన కాలంలో జర్మనీ, స్వీడన్, ఇటలీ, లిచ్టేన్ స్టెయిన్, ఆస్ట్రియా, స్విట్జెర్లాండ్, ఫ్రాన్సు, బెల్జియం, నెదర్లాండ్స్, జెక్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించటం జరిగింది. అక్కడి సామాజిక, రాజకీయ,చారిత్రక అంశాలమీద లోతుగా అధ్యయనం చేసే అవకాశం దక్కింది. హిట్లర్ అంటే చిరంజీవి నటించిన ఒక సినిమాగా మాత్రమే తెలిసిన నాకు అసలు ఆ పదం ఈ యుగంలోనే స్మరించరానిది అని అర్ధం అయ్యింది. ఇప్పటి తరానికి అవగాహన లేక హిట్లర్ ని ఒక హీరోగా, అతను చెప్పిన మాటలని వేదవాక్కులుగా  సామాజిక సంభందాల వెబ్ సైట్ లలో పోస్ట్ చెయ్యటం చూశాక, నేను నా అనుభవాలు రాయటం అవసరం అనిపించింది. అసలు హిట్లర్ ఏం చేశాడు? నియంతకి ప్రత్యామ్నాయ పదం హిట్లర్ మాత్రమేనా? 2 కోట్ల మంది ని ఊచకోత కోసిన నరరూప రాక్షసుడు ఈ తరానికి హీరోనా? యుద్ధాన్ని ఒక దైనందిన కార్యక్రమంలా చేస్తూ, మనుషుల్ని చంపటానికి డెత్ ఫ్యాక్టరీలు పెట్టి, రోజువారి టార్గెట్ లతో ఒక్కొక్క ఫాక్టరీలో మిలియన్లమందిని గ్యాస్ చాంబర్లలో హతమార్చిన నాజీల నాయకుడు ఈ తరానికి ఆదర్శమా? నేను 1948 తెలంగాణా విముక్తి పోరాటాల గురించి చదువుతున్నపుడు చదివిన ఒక పాటలో ఉన్న ఓ పదం ఇక్కడ జ్ఞాపకం వచ్చేది. నాజీల మించినవురో నైజాము సర్కరోడా అని.కాని అప్పటికి నాజీలు ఎవరో తెలియదు. తెలిసాక నాజీలని మించిన వారు ఈ ప్రపంచంలోనే లేరని అర్ధం అయ్యింది.కేవలం హిట్లర్ గురించి తెలుసుకోవటానికే నేను మూడుసార్లు జర్మనీ లో ప్రయాణించాను. వెళ్ళిన ప్రతి దేశంలోనూ రెండవ ప్రపంచయుద్ధపు మారణ హోమానికి సంభందించిన గుర్తులు వెతికాను. వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ నాజీలు ఇక్కడికి వచ్చారా అని స్థానిక గైడ్ లని అడుగుతుంటే తోటి మిత్రులంతా ఏంటి నీకీ హిట్లర్ పిచ్చి అని నవ్వుకున్నారు.హిట్లర్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క యూదుల పట్ల సాగించిన మారణ హోమం పట్ల ఆవేదన పెల్లుబుకేది. 1945 లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక మిగిలిన శిధిలాల నుండి ఎదిగిన యూరప్ దేశాలు,ఇప్పుడు చూస్తుంటే నిజంగా అధ్బుతమే అనిపించింది.శతాబ్దాల క్రితం జరిగిన పానిపట్టు యుద్ధాలు, తుళ్ళికోట యుద్ధాలు గురించి, పల్నాటి యుద్ధాల గురించి చదువుతున్నపుడు కలిగిన ఆశ్చర్యం, ఆసక్తి కంటే ఈ శతాబ్దంలో కేవలం అరవై ఏళ్ల క్రితం, ఇప్పుడు అత్యంత ప్రశాంతంగా కనిపించే యూరప్ ఖండంలో హిట్లర్ నాజీ పాలన అనేక దేశాల్లో యూదుల మీద, కమ్యూనిస్టుల మీద, ప్రజాస్వామ్యం మీద పరమ భయంకరమైన మారణకాండను రుద్దుతుంటే ప్రపంచం మౌనంగా ఎందుకు ఉండిపోయిందో అర్ధం కాలేదు. యుద్ధాన్ని ప్రారంభించి, యూరప్‍లో ఒక్కో దేశాన్నే కబళిస్తూ, వేలాదిమంద్ని నరమేధం సాగిస్తూ హిట్లర్ ముందుకు కదులుతుంటే, శక్తిమంతంగా ఎందుకు ఈ బూర్జూవా ప్రజాస్వామిక దేశాలు అడ్డుకోలేకపోయాయో అర్ధం కాలేదు. సాటి మనిషిని ఎటువంటి శత్రుత్వం లేకుండా అత్యంత క్రూరంగా చంపగల మనస్తత్వాలని నాజీలకి హిట్లర్ ఎలా నూరిపోయగాలిగాడో అర్ధం కాని విషయం.ఈ నరమేధానికి నాంది ఇప్పుడు నేను వెళ్తున్న పోలాండ్ దేశం. రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా జర్మన్ సైన్యం మొదటగా విరుచుకు పడింది పోలాండ్ మీదే. 

 

 

 

ఫోటో వివరాలు: రష్యా సైన్యం జర్మనీ రాకుండా నిలువరించటానికి పోలాండ్ సరిహద్దు వెంబడి హిట్లర్ నిర్మించిన 32 కిలోమీటర్ల పొడవున భూగర్భం లో ఉన్న బంకర్. 

 

ఈ చరిత్రంతా తెలియకుండానే మే 4, 2012 న హైదరాబాదు రాజీవ్ గాంధి విమానాశ్రయం నుండి తెల్లవారుఝామున 3 గంటలకి ఖతర్ ఎయిర్వేస్ విమానం ఎక్కాను. పోలాండ్ కి నేరుగా విమానాలు లేకపోవటంతో ఖతర్ లో వేరే ఫ్లైట్ మారాలి. హైదరాబాదు నుండి ఖతర్ 4 గంటల ప్రయాణం. మనం ఖతర్ కంటే గంటన్నర ముందు ఉంటాం. మధ్య ప్రాచ్యం లో ఉన్న అత్యంత సంపన్న దేశం ఖతర్. ఇక్కడ ప్రతి 1000 మంది లో 147 మంది కోటీశ్వరులు.నేను ఎక్కిన ఫ్లైట్  అక్కడ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకి ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయ్యింది.

--రాజేష్ వేమూరి(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com