క్రీస్తు పునరుత్థానంమానవాళికి వరం

- March 26, 2016 , by Maagulf
క్రీస్తు పునరుత్థానంమానవాళికి వరం

స్వార్థం, కుట్రలు, అబద్ధాలు, హింస, దౌర్జన్యం వంటివి త్యాగం, నిస్వార్థం, ప్రేమ, క్షమాపణ,పవిత్రత వంటి అమూల్యమైన మానవీయ విలువల ముందు మోకరిల్లవలసిందే అన్నది యేసుక్రీస్తు పునరుత్థానం చాటే చారిత్రాత్మక సత్యం. మరణంతో అంతమయ్యేదే జీవితమైతే, జీవించడం వ్యర్థమనుకున్నాడొక మహనీయుడు. జీవితానికి విషాదాంతంగానే మానవాళికి తెలిసిన ‘మరణం’ ముల్లును విరిచి తాను పునరుత్థానుడవడం ద్వారా యేసుక్రీస్తు మరణాన్ని నిత్యజీవితానికి తొలిమెట్టును చేశాడు. జీవితానికి, నిత్యజీవితానికి నడుమ అంతకాలంగా ఉన్న మానవమాత్రులెవరూ దాటలేని అగాథంపైన, తన పునరుత్థానం ద్వారా మరణాన్ని వంతెనగా చేసి, రాజదర్పంతో దాటి, దాన్ని కాళ్లతో తొక్కుతూ పరలోకంవైపు వెళ్లాడు యేసుక్రీస్తు. తన వెంటే విశ్వాసులంతా పరలోకానికి వెళ్లే మహోన్నతావకాశాన్ని ఏర్పర్చాడు.తొలి ఈస్టర్ ఆదివారం తెల్లవారు జామున మగ్దలెనె మరియ, మరొక మరియ, సలోమి తదితర స్త్రీలు యూదు మతాచారం ప్రకారం ఆయన పార్థివ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసేందుకు వెళ్లారు. అయితే ఆయన పునరుత్థాన పరిమళం అప్పటికే అంతటా వ్యాపించింది. ‘ఆయన సజీవుడయ్యాడు. ఇక మృతులలో వెదకకండి’ అంటూ ఆయన వదిలేసి వెళ్లిన ఖాళీ సమాధిలోని ఒక దేవదూత ప్రకటించిన పునరుత్థాన శుభవార్త ఆ స్త్రీలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ వెంటనే పరుగున వెళ్లి, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన ప్రియశిష్యులకు ప్రకటిస్తే, వాళ్లూ పరుగెత్తుకుని వచ్చి ‘ఖాళీ సమాధి’ని సందర్శించారు.ఆ పిదప నలభై రోజులకు పరలోకానికి ఆరోహణం కావడానికి ముందు యేసు అనేకసార్లు స్త్రీలకు, శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. రాబోయే కాలంలో తన మరణ పునరుత్థానాలే పటిష్ఠమైన పునాదిగా ఏర్పాటు చేయవలసిన ఆత్మ సామ్రాజ్యపు చర్చి మూలాంశాలను ప్రబోధించాడు. ధనార్జనకు, స్వార్థానికి, అధికార దాహానికి, దౌర్జన్యానికి తావులేని ఒక ప్రేమ సామ్రాజ్యంగా ‘చర్చి’ పవిత్రతలో విలసిల్లాలని ప్రభువు ఆపేక్షించాడు. యేసుక్రీస్తు పునరుత్థానమే క్రైస్తవానికి ఆయువు పట్టు. త్యాగం, నిస్వార్థత, ప్రేమ, క్షమాపణ, పవిత్రత వంటి అమూల్యమైన మానవీయ విలువలన్నీ యేసుక్రీస్తు పునరుత్థానంలో ఘనవిజయాన్ని సాధించాయి. రోమా సైనికుల దౌర్జన్యం, హింస, యూదు మతపెద్దల కుట్రలు, అబద్ధాలు, యూదా ఇస్కరియోతు ద్రోహం, మిగిలిన శిష్యుల పిరికితనం, పిలాతు తదితరుల నిరాసక్త వైఖరి ఇవన్నీ యేసుక్రీస్తు పునరుత్థానంలో నిర్వీర్యమై చిత్తుగా ఓడిపోయాయి. లోకంలో రాజ్యమేలే స్వార్థం, దౌర్జన్యం, హింస, పిరికితనం, కుట్రలు, అబద్ధాలు ప్రేమ సామ్రాజ్యపు నిజ విలువలైన ప్రేమ, క్షమాపణ, త్యాగం, వితరణ ముందు మోకరిల్లవలసిందేనని పునరుత్థానం రుజువు చేసింది.

యెరూషలేములోని అత్యంత ధనవంతుల్లో ఒకడు, ఎంతో నిష్ట కలిగిన యూదు మత ప్రవిష్టుడు అరిమతై యోసేపు. క్రీస్తు మరణించిన వెంటనే పిలాతు వద్దకెళ్లి యేసుక్రీస్తు పార్థివదేహాన్ని తనకివ్వాలని అభ్యర్థించాడు యోసేపు. తాను అన్యాయపు తీర్పు చెప్పానని అప్పటికే నేర మనస్కతతో ఉన్న పిలాతు మారుమాట్లాడకుండా యేసుక్రీస్తు శరీరాన్ని అరిమతై యోసేపుకిచ్చాడు. నికోదెము అనే మరో ధనవంతుడు తెచ్చిన అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాల్ని ఆయన పవిత్ర దేహానికి పూసి, తనకోసం ప్రత్యేకంగా రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో అరిమతై యోసేపు ప్రభువు దేహాన్ని ఖననం చేశాడు. అన్యాయపు తీర్పు చెప్పి సిలువ వేయించిన పిలాతు స్వయంగా తన చట్టాన్ని ఉల్లంఘించి యేసుక్రీస్తు దేహాన్ని ఖననక్రియలకోసం అందజేయడం ఒక విజయమైతే, కుట్రదారులైన యూదులందరిలోకి ప్రముఖుడైన అరిమతై యోసేపు అనే యూదు ఛాందసుడే స్వయంగా యేసుక్రీస్తుకు రాచమర్యాదలతో అంత్యక్రియలు చేసి తన సొంత సమాధిని ఆయనకివ్వడం అంతకన్నా ఘనవిజయం.
యేసుక్రీస్తు మూడవనాడు పునరుత్థానుడైన తర్వాత అంతా ఆయనలో విజయాన్ని చూశారు. కాని అదేమీ జరుగక మునుపే అరిమతై యోసేపు యేసుక్రీస్తు పునరుత్థాన విజయానికి తన విశ్వాస క్రియల ద్వారా పునాది వేశాడు. ఆ తర్వాత అరిమతై యోసేపును యూదులు బహిష్కరించారు. అతని ఆస్తంతా హరించుకుపోయి నిరుపేద అయ్యాడని చరిత్ర చెబుతోంది. కాని తిరుగులేని విశ్వాసిగా అరిమతై యోసేపు ఇప్పటికీ మన స్మృతిపథంలో ఉన్నాడు. తన విశ్వాసంతో అందరినీ సవాలు చేస్తున్నాడు. సజీవుడైన యేసుక్రీస్తును, ఆయన పరిచర్యను అడ్డుపెట్టుకొని అన్నీ పొందాలనుకోవడమే యేసును మృతులలో వెదకడం!! ఆయనకోసం అన్నీ పోగొట్టుకుని పరలోకాన్ని మాత్రమే పొందడం, అరిమతై యోసేపు విశ్వాసజీవితంలో వెల్లివిరిసిన పునరుత్థాన సందేశం!!   ఈస్టర్ విశేషాలుయేసుక్రీస్తు పునరుత్థానుడైన ఉదంతంపై అంతా కలిసి తేల్చిన సారాంశమేమిటంటే, నూటికి నూరు పాళ్లు ఆయన పునరుత్థానం వాస్తవం అని. ఆ పరిశోధనల సారాంశాన్నంతా సంగ్రహించిన జాష్ మెక్ డోవెల్ అనే చరిత్రకారుడు ‘ది ఎవిడెన్స్ దట్ డిమాండ్స్ ఎ వె ర్డిక్ట్స్’ అనే పుస్తకం రాశాడు.యేసుక్రీస్తు మరణ, పునరుత్థానాలను వివరించిన బైబిలులోని నాలుగు సువార్తలూ కట్టు కథలని రుజువు చేయడం కోసం 33 ఏళ్లు పరిశోధనలు చేసిన సర్ విలియమ్ రామ్‌సే అనే నాస్తికవాద చరిత్రకారుడు, చివరికి గొప్ప విశ్వాసిగా మారి ఆ నాలుగు సువార్తలూ పేర్కొన్న అంశాలన్నీ తిరుగులేని వాస్తవాలని ఒప్పుకొని ‘ట్రస్ట్ వర్దీనెస్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్’ అనే మహా గ్రంథాన్ని రాశాడు.యేసుక్రీస్తు దేహాన్నుంచిన రాతి గుహకు అడ్డంగా పెట్టిన పెద్ద బండరాయి బరువు రెండు టన్నులు. అంటే దాదాపుగా రెండువేల కిలోలుంటుంది. దాన్ని కనీసం ఇరవై మంది కలిసి దొర్లించాలి. అక్కడ రోమా భటులు నలుగురు కావలి ఉన్నారు, పైగా ఆ బండరాయికి రోమా ప్రభుత్వ ముద్ర వేశారు. అందువల్ల చాలామంది ప్రచారం చేసినట్టుగా ఆయన దేహాన్ని దొంగిలించే ప్రసక్తే లేదు.యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు, స్పృహ కోల్పోతే, చనిపోయాడనుకుని గుహలో పెట్టారు, మూడవనాడు ఆయన స్పృహలోకొచ్చి నడిచి వెళ్లిపోయి తాను పునరుత్థాడనయ్యానని అందర్నీ భ్రమపెట్టాడు’ అన్నది ఒక కథనం. ఒకవేళ ఆయన చనిపోలేదనుకున్నా, సిలువలో అంతగా గాయపరచబడిన వ్యక్తి మూడవనాటికి స్పృహలోకొచ్చినా, అంత పెద్ద రాయిని తన కు తానే తొలగించుకొని, కాపలా ఉన్న నలుగురితో పెనుగులాడి పారిపోవడానికవసర మయ్యే శక్తి ఉంటుందనడానికి మెడికల్ సైన్స్ ఒప్పుకోదు.జోసెఫ్ అనే చరిత్రకారుడు (క్రైస్తవుడు కాదు), ఇంకా ఇతర యూదు చరిత్రకారులు రెండవ శతాబ్దంలో కొన్ని పుస్తకాల్లో యేసు పునరుత్థానం వాస్తవమేనని, అది ఖాళీ సమాధేనని నిర్థారించాడు.క్రీస్తు నిజంగా పునరుత్థానుడు కాలేదని, అదంతా వారి ఊహేనని ప్రచారం జరిగింది. పునరుత్థానుడైన యేసును 500 మంది చూశారని బైబిలులో ఉంది. వీరంతా అదే ఊహించారా?క్రీస్తు ఎత్తు 6 అడుగుల నాలుగంగుళాలు ఉంటుందంటారు. ఆయన్ను పడుకోబెట్టిన చోట రాతి గోడను నాలుగంగుళాలు లోపలికి అప్పటికప్పుడు తొలగిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి.

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com