'వారి తల రాత మార్చిపో'

- April 08, 2016 , by Maagulf

నువ్వొస్తున్నావు వెడుతున్నావు"యుగాదివై"
ఏం తెస్తున్నావో ఏం తీసుకెల్తున్నావో
నీకైతే తెలుసో తెలియదో మరి ?? 
ఇక్కడ దినాలు దినార్లు దర్హమ్స్ 
అయి రాలిపోతుంటే,ప్రాణం తల్లి 
ఒడికై తల్లడిల్లుతున్నది 
అక్కడేమో మాతృభూమి అసహనమంటూ
మూలుగుచున్నది,మతమంటూ మనిషిని 
మాయావిని చేస్తున్నది 
కులం అంటూ విశ్వ విద్యాలయాలు"ఉరి"   
కొయ్యలవుతున్నాయి,రగులుతున్న 
రచ్చలవుతున్నాయి, అబలల బ్రతుకు
రాక్షస క్రీడలతో రక్తస్థిక్తం అవుతోంది
ప్రకృతీ పదే పదే  కోపంతో పగబట్టి 
చెట్లను మొక్కలను మాడుస్తున్నది 
ఎండిన చేలేమో రైతులను,పశువులను 
బలి తీసుకుంటున్నవి...
పురుగుల మందేమో, చివరి సారి 
అన్నదాతకు ఆహరం అవుతున్నది 
మరి నువ్వొస్తున్నావు పోతున్నావు మొన్న 
జయవై వెలిగి నిన్న మన్మధవై వెడుతూ
ఈసారి "దుర్ముఖి" వై వస్తున్నావు 
ఇక్కడ క్రొత్త సంస్థానాలు కొత్త కొలువులు ఏర్పడుతూ కొంగు బంగారాలవుతూ,
అవసరం లేని ఖజానాలేమో నిండుతున్నాయి 
అధికారులు పాలకులు పంతుల్లు పామరులు అందరం,నీ కోసం ఏటేట పండగ చేసుకుంటున్నాం 
మనిషన్నాక కష్ట సుఖాలు సహజమే అని, 
లేని దానికి ఆశ పడి కానిదానికి గ్రహచారం అని,తల పట్టుకుంటూ ...
చేదు తీపి పులుపు కారం ఒగరు అన్నీ కలుపుకు 
తింటున్నాం,
అయినా అభాగ్యుల బతుకు కేవలం 
చేదు మయమే చేస్తున్నావెందుకో ? 
ఇప్పటికైనా వస్తూ పోవడమే కాదు ఓ"దుర్ముఖి"
దేశంలో పుట్టిన దుర్మార్గపు భావనలపై పిడికెడు మట్టి కొట్టి,
మనిషి గుండెలో మహాత్మున్ని ఉంచి
ప్రతీ మనసు విస్వహితం కోరేలా 
ప్రపంచ శాంతికి 
ఓ ప్రేమ ముఖం వేయుటకురా 
"దుర్ముఖి"నామ సంవత్సరానివై దిగిరా
ఈ ఉగాది ఈ లోకానికి క్రొత్త ఆశవై
దాహంతో ఉన్న వాళ్ళ తాపం తీర్చి 
కోరుకున్న వారి కోటి కోరికలు తీర్చి 
జాతకాలు చూపించుకున్న వాళ్ళ 
బంగారు పెట్టి నింపి వెళ్ళు...అలాగే 
కఠిన శోకంతో ఉన్న కాలే కడుపు ఆకలి 
మాత్రం తీర్చిపో మరచి పోక వచ్చి 
వారి తల రాతలు కాస్త మార్చిపో మార్చిపో 
వారి కళ్ళల్లో కొత్త చిగుళ్ళు వేసిపో...!

--జయరెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com