దుర్ముఖీ!!

- April 11, 2016 , by Maagulf

 

దుర్ముఖి నామ వత్సరమ! దోసిలియొగ్గి నమస్కరించెదన్!

ధర్మము నాల్గుపాదముల తప్పకయుండు విధంబు జూపుమా

మర్మము లేక మాపయి సమంచిత దృక్కులవిందుసేయుమా

అర్మిలి నీకు సాదర శుభాగమ తోరణముల్ ఘటించెదన్.

 

దుర్ముఖి నామధేయమున దుష్ట చరత్వము గోచరింపదే!

నర్మ కుయుక్తులన్ వదలి నవ్యపథంబున సాగిపొమ్ము మా

కర్మము కాలెనంచు కడు గాసిలిపోవను- సన్ముఖంబుతో

నిర్మల భాగ్యదాయివయి నిత్య సుఖంబులనిచ్చి బ్రోవుమా.

 

మామిడికొమ్మపైన మధుమాస విలాస వినోద మంజరీ

కోమల కోకిలస్వనము కోటి వసంత పసందు రాగముల్

వేమరు పల్కుచుండ ప్రభవించిన చైత్ర ఉగాది వేడుకల్

నామది నిండి యీకవిత నర్తనమాడెను నాకలంబునన్.

 

మన్మథ! వీడుకోలు గొనుమా! తెలుగిండ్లను తీపి, చేదుగా

ఉన్ముఖమైన నీచరితకున్నది ప్రాభవ వైభవంబు, మా

జన్మల కొత్త వెల్గుల ప్రసారములబ్బెను-పోయిరమ్ము ఠే

వన్మధు రాగరంజిత ప్రభావము జూపితివమ్మ మాపయిన్.

 

నందన వనమున విరిసిన

సుందర సుకుమారమౌ ప్రసూనము వోలెన్

సందడి చేయుత దుర్ముఖి 

చందనమై, చల్లనై ప్రశస్తి లభింపన్.

 

                   బి.వి.వి.హెచ్. బి.ఫ్రసాదరావు  ఎం.ఎ;  ఎం యిడి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com