శ్రీ స్వామి వివేకానంద

- July 03, 2016 , by Maagulf

భారతదేశాన్ని ప్రేమించడమెలాగో, ఉద్ధరించడమెలాగో నేర్పిన మహనీయుడు స్వామి వివేకానంద!
‘‘ఓ తేజస్వరూపా! జననమరణాలకు అతీతుడా! మేలుకో. బలహీనతల్ని తొలగించుకో. పౌరుషాన్ని ప్రసాదించుకో. మనిషిగా మసలుకో. లే. లెమ్ము’’ అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతభేరి స్వామి వివేకానంద.

'స్వామి వివేకానందను కలుసుకొని, ఆయన సాంగత్య భాగ్యం పొందిన మేం నిష్కృమించాక ఆయన సందేశమూ, మహత్కార్యమూ కాలగర్భంలో కలసి పోతాయి. స్వామి వివేకానంద ప్రభావం మనుషుల జ్ఞాపకాల నుండి తొలగిపోయినట్లు అనిపిస్తుంది. నూటయాభై లేదా రెండు వందల సంవత్సరాలు గడచిన తరువాత పరికిస్తే హఠాత్తుగా ఆయన ప్రభావం పాశ్చాత్యదేశాల వైఖరినే ఆమూలాగ్రం మార్చివేసి ఉంటుంది!'' అని సోదరి నివేదిత వ్రాసింది. పాశ్చాత్య దేశాలకు మాత్రమే కాదు, భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికే అన్వయించే భావన ఇది! నివేదిత ఎత్తిచూపిన ఆ కాలఘట్టంలో నేడు మనం నిలబడివుండడం గర్వించదగ్గ విషయం. స్వామి వివేకానంద అమృత వాక్కులు నిత్యసత్యములు మనం గుర్తుంచుకోవలసిన విషయాలు: ప్రతి జీవి పరాత్పరుడే. ఈలోకంలో  సత్సాంగత్యము కంటే పవిత్రమైనది మరి ఒకటి లేదు. స్వార్ధ చింతన లేనప్పుడే మనం ఘన కార్యములు సాధిస్తాం. మన ప్రభావం ఇతరులపై పడుతుంది. మతమంతా (ధర్మ) మనలోనే ఉంది. గ్రంధాలు గాని, గురువులు గాని, దాన్ని కనుగొనటానికి సహాయపడటం కన్నామజేమి చేయలేరు. వారు లేకపోయినా మనలోనే సత్యాన్ని దర్శించగలం. మతం (ధర్మం) వంటిది. ఇది అనేక తన్నులు తన్నినా లెక్క చేయవద్దు. అది చాలా పాలు ఇస్తుంది. భక్తి మార్గం సహజం, సంతోషదాయకం. మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకుని నీ జీవితాన్ని మలుచుకోవాలి.

భారతదేశ ఘనతను వర్ణిస్తూ ఆయన ఇక్కడనే ఈ ఒక్క దేశంలోనే మానవ హృదయం అతి విశాలమై అనంత విస్తృతిని పొంది తోటి మానవ జాతినే కాక పశుపక్ష్యాదులతో సహా సమస్త ప్రాణికోటి చేత సర్వజగత్తు ఉచ్చంనీచం లేకుండా తనతోనే వున్నట్లు భావన చేయగలిగింది అన్నారు. మనలోని లోపాలు వివరిస్తూ "మనంతట మనం పని చేయం, పనిచేసే వారిని పనిచేయనీయం. వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవ జాతిపతనానికి ముఖ్యమైనదీ లక్షణమే" అన్నారు. దైవ విశ్వాసం కంటే మానవ విశ్వాసం ముఖ్యమని బోధిస్తూ "మూడు వందల ముఫై కోట్ల దేవతలలోనూ నమ్మకమున్నా నీలో నీకే విశ్వాసం లేకపోతే నీకు ముక్తి లేదు. దేశ ప్రజలందరికి ఆత్మవిశ్వాసం క్రియా శూరత్వము కావాలి. ఈ అవసరము నాకు స్పష్టంగా కనిపిస్తుంది" అని నొక్కి చెప్పారు. అంతేకాక "మనం సోమరులము, ఏ పని చేయలేము ముందు మనమంతా సోమరితనాన్ని వదిలి కష్టించి పనిచెయటం అలవర్చుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది" అంటూ యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద.

స్వామి వివేకానంద ఇలా యువతను జాగృతం చేసారు.

* ప్రేమ... డబ్బు... ఙ్ఞానం.. చదువు... దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించే తత్వం.

* గొప్ప అవకాశాలే వస్తే ఏమి చేతకాని వారు కూడా ఏదో గోప్ప సాదించ వచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాదించినవాడే గొప్పవాడు.

* ఆత్మవిస్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాదించిన గొప్ప వ్యక్తుల జీవతాలన నిశితంగా పరిశీలించండి వారిని నడిపించింది ఆత్మవిశ్వసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు అనేది ఒకప్పటి మాట. ఆత్మవిస్వాసం లేనివాడు నాస్తికుడు అనేది నేటి మాట.

* ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. భాధ్యత తీసికో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.

* పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.

* పిరికితనానికి మించిన మహపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి, అప్పుడే మనిషినని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కాని పోరాటం అవసరం.

* అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం ఇదే మనకు కావలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి ముందడుగే వేయండి.

* మనలొ ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదు నిమిషాలు పని చేయలేం. ప్రతి వ్యక్తి పెత్తనం కోసం పాకులాడుతుంటాడు అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతుంది.

రామకృష్ణ పరమహంస వద్ద నాలుగేళ్ల శుశ్రూషలో నరేంద్రుడు నేర్చుకున్నవి ఎన్నో! ప్రాచీన కాలపు గ్రీసులో సోక్రటీసు గొప్ప గురువు. ప్లేటో గొప్ప శిష్యుడు. మళ్లీ మానవ చరిత్ర పరిణాహంలో గురువంటే రామకృష్ణుడు. శిష్యుడంటే వివేకానందుడు. భారతదేశాన్ని చదవాలంటే వివేకానందుణ్ని చదివితే చాలు. శ్రద్ధ, నిస్వార్ధమే శిష్యరికానికి గీటురాళ్లని, దరిద్ర నారాయణసేవే పరమధర్మమని ఆయన అన్నారు.

హైదరాబాదులో రామకృష్ణ మఠము ఏర్పాటు చేసి సంస్కృత భాషలోనే కాకుండాపాశ్చాత్య భాషలు అనగా ఫ్రెంచి, జర్మన్, జపనీస్ మొదలగు భాషలలో ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు. పుస్థక విక్రయ కేంద్రము, ఆస్ప్రత్రి మొదలగు సంస్థలు ఈ సంస్థ అధ్వర్యములోనే నిర్వహించ బడుచున్నవి. కీసరగుట్టలో వృద్దుల వసతి కొరకు ఒక అశ్రమము నడపబడుచున్నది. రామకృష్ణ మఠము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమములులను గుర్తించి భారత ప్రభుత్వం ఉత్తమ సేవా సంస్థగా ఎంపిక చేసి, కోటి రూపాయలు నగదు బహుమతి ఇచ్చి సత్కరించినది. ఈ విధముగా మానవాళికి చైతన్యదీప్తిగా స్వామి వివేకానంద విశ్వవిఖ్యాతి పొందినాడు.

కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగాలపై ఆయన చేసిన రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. గాంధీ లాంటి అహింసామూర్తులకూ, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్, జతిన్‌దాస్‌లాంటి అతివాదులకూ వివేకానందుడి మాటలే బాటలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com