కవిత కు బిగ్ షాక్ ఇచ్చిన కేటీఆర్

- September 01, 2025 , by Maagulf
కవిత కు బిగ్ షాక్ ఇచ్చిన కేటీఆర్

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు పై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో, కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమని, వారి వల్లే కేసీఆర్‌కు ఈ పరిస్థితి వచ్చిందని కవిత ఆరోపించారు. అయితే, కవిత వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తూ, కేటీఆర్ తన ట్వీట్‌లో హరీష్ రావుకు పూర్తి మద్దతుగా నిలిచారు. బీఆర్‌ఎస్ అధికారిక అకౌంట్ పోస్ట్ చేసిన ఒక వీడియోను ఆయన రీట్వీట్ చేస్తూ “ఇది మా డైనమిక్ లీడర్ హరీష్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్” అని క్యాప్షన్ ఇచ్చారు.

కేటీఆర్ చేసిన ట్వీట్‌లో హరీష్ రావును ప్రశంసిస్తూ, ఆయన ఇరిగేషన్ శాఖ గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు నేర్చుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ ద్వారా, హరీష్ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలను కేటీఆర్ ఖండించడమే కాకుండా, పార్టీలో ఆయనకున్న ప్రాముఖ్యతను పరోక్షంగా తెలియజేశారు. కవిత వ్యాఖ్యల అనంతరం కేటీఆర్ వెంటనే స్పందించడం, హరీష్ రావుకు మద్దతు తెలపడం పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరింత స్పష్టం చేశాయి. కేసీఆర్ మౌనంగా ఉన్న సమయంలో, కేటీఆర్ స్పందించి హరీష్ రావుకు అండగా నిలవడం గమనార్హం.

ఈ మొత్తం వివాదం కవిత చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. ఆమె తన తండ్రిపై సీబీఐ ఎంక్వయిరీ వేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు డబ్బుపై, తిండిపై ఆశ ఉండదని, ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావుల వల్ల జరిగిందని ఆరోపించారు. వారిద్దరూ అవినీతి కొండలని, కాళేశ్వరం కేసులో హరీష్ రావుదే ముఖ్య పాత్ర అని కూడా అన్నారు. అందుకే రెండోసారి కేసీఆర్ ఆయనకు ఆ శాఖ ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ, వారిద్దరిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌కు సవాల్ చేశారు. కవిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలను బయటపెట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com