సినిమా రివ్యూ: ‘మాస్ జాతర’.!

- November 01, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘మాస్ జాతర’.!

‘ధమాకా’ సూపర్ హిట్ తర్వాత మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా తెరకెక్కిన చిత్రమిది. తనకు బాగా కలిసొచ్చిన పోలీసాఫీసర్ పాత్రలో రవితేజ కనిపిస్తాడు ఈ సినిమాలో. అయితే, ఈ సారి కొంచెం కొత్తగా రైల్వే పోలీస్ గెటప్‌లో కనిపిస్తాడు. గతంలో పలుమార్లు ఖాకీ దుస్తుల కాన్సెప్ట్‌తో హిట్లు అందుకున్నమాస్ రాజా రవితేజ, ఈ సారి కూడా ఆ సక్సెస్ కంటిన్యూ చేశాడా.? లేదా.? తెలియాలంటే ‘మాస్ జాతర’ కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:

లక్ష్మణ్ భేరి (రవితేజ) ఓ సిన్సియర్ రైల్వే పోలీసాఫీసర్. తన పరిధిలో లేకున్నా సరే, కళ్ల ముందర అన్యాయం జిరిగితే చూస్తూ ఊరుకోడు. చిన్నతనంలోనే తల్లితండ్రుల్ని కోల్పోయిన లక్ష్మణ్ భేరి, తాత హనుమాన్ భేరి (రాజేంద్ర ప్రసాద్) పెంపకంలో పెరుగుతాడు. రైల్వే పోలీసాఫీసర్‌గా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో ఓ ఎమ్మెల్యే కొడుకుతో వివాదానికి దిగి..వున్న చోటి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి అల్లూరి జిల్లా అడవివనంకి ట్రాన్స్‌ఫర్ నిమిత్తం వస్తాడు. ఇక్కడి అటవీ ప్రాంతంలో శీలావతి గంజాయ్ వ్యాపారం చేస్తుంటాడు శివుడు (నవీన్ చంద్ర). లోకల్ ఎస్పీతో పాటూ, పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల అండ దండలుంటాయ్ శివుడికి. శివుడు చేస్తున్న అక్రమ వ్యాపారాల గుట్టు తెలిసిన లక్హ్మణ్ శివుడికి అడ్డమెళతాడు.ఒకానొక సమయంలో కలకత్తా చేరాల్సిన కొన్ని కోట్ల విలువ చేసే, శివుడి గంజాయ్ సరుకును చాకచక్యంగా పట్టుకుని దాచేస్తాడు లక్ష్మణ్ భేరి. దాంతో, శివుడు ఏం చేశాడు.? శివుడు అండ్ గ్యాంగ్ ఆ సరుకును ఎలా కనిపెట్టారు.? ఈ క్రమంలో లక్ష్మణ్‌కీ, శివుడికి జరిగిన భారీ పోరు ఎలాంటిది.? తులసి (శ్రీలీల) ఎవరు.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే, ‘మాస్ జాతర’ ధియేటర్లలో చూడాల్సిందే.!

నటీనటుల పని తీరు:
ఈ సినిమా కోసం రవితేజ తన మునుపటి ఎనర్జీని తిరిగి తెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. ఫుల్ ఎనర్జిటిక్‌గా, తన మాస్ స్వాగ్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపుతాడు. తనదైన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్.. మాస్ యాక్షన్‌తో కట్టిపడేస్తాడు. హీరోయిన్ శ్రీలీల మూడు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో కనిపించింది. ఇంతవరకూ ఆమె చేసిన పాత్రల్లో ఈ సినిమాలో చేసిన పాత్ర ఒకింత బెటర్‌గా అనిపిస్తుంది. రవితేజతో కలిసి వేసిన మాస్ స్టెప్పులు బాగుంటాయ్. రాజేంద్ర ప్రసాద్, హీరోకి తాతగా తనదైన ఎనర్జీ చూపించారు. నవ్వులు పూయించారు. సెకండాఫ్‌లో ఓ యాక్షన్ స్వీక్వెన్స్‌తోనూ సర్‌ప్రైజ్ చేస్తారు. విలన్ రోల్ పోషించిన నవీన్ చంద్ర మంచి పొటెన్షియల్ వున్న నటుడు. కానీ, ప్రధమార్ధంలో చూపించిన విలనిజంలోని క్రూరత్వాన్ని సెకండాఫ్‌కి వచ్చేసరికి కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ పాత్రను దర్శకుడు ఇంకాస్త బలంగా డిజైన్ చేసి వుంటే బాగుండేది. వీటీవీ గణేష్, హైపర్ ఆది తదితరులు కనిపించిన ప్రతీసారీ నవ్వులు పూయిస్తారు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
కొత్త దర్శకుడు భాను భోగవరపు.. ఈ సినిమాకి కథ విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. కేవలం రవితేజ అభిమానులకు కనెక్ట్ అయ్యేలా ఎనర్జిటిక్ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు.. కామెడీ.. ఇలా కొన్ని అంశాలపైనే ఫోకస్ పెట్టాడు. కథతో పాటూ, స్ర్కీన్‌ప్లే‌లోనూ ఉండాల్సిన జోష్ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ఫస్టాఫ్ కొంతవరకూ బెటర్‌గా అనిపించినప్పటికీ, సెకండాఫ్ రొటీన్ రొట్ట కొట్డుడే. విలన్ ఇంటికొచ్చి హీరో చేసే యాక్షన్‌తో పాటూ రచ్చ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. అలాగే, గంజాయ్‌ని దాచి పెట్టేయడం.. దాని కోసం విలన్ గ్యాంగ్ పడే పాట్లు.. విలన్ ఎత్తులకి హీరో వేసే పై ఎత్తులు ఒకింత బాగానే వుంటాయ్ కానీ, చాలా సినిమాల్లో ఆల్రెడీ చూసేశాం కదా.. అనిపించేలా వుంటాయ్. వాటిని ఇంకాస్త కొత్తగా డిజైన్ చేసి వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో లోపాలున్నాయ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
రవితేజ ఎనర్జీ.. అక్కడక్కడా ఆకట్టుకున్న కామెడీ సన్నివేశాలు, రవితేజ స్టైల్ యాక్షన్ ఘట్టాలు, క్లైమాక్స్ సన్నివేశాలు..

మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం, బోరింగ్ స్ర్కీన్‌ప్లే, సెకండాఫ్..

చివరిగా:
‘మాస్ జాతర’..రవితేజ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన ఓ మోస్తరు మాస్ ట్రీట్‌గా చెప్పొచ్చు. అయితే, కేవలం అది రవితేజ ఫ్యాన్స్‌కి మాత్రమే అనే షరతులు వర్తిస్తాయ్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com