మీ బ్యాంక్ వెబ్‌సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు

- November 14, 2025 , by Maagulf
మీ బ్యాంక్ వెబ్‌సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు

ముంబై: మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? అయితే అలర్ట్. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ల డొమైన్ ఇటీవల మారిపోయింది. గతంలో ఈ వెబ్‌సైట్ల అడ్రస్‌లు .com (డాట్ కామ్) లేదా .co.in (కో డాట్ ఇన్) అని ఉండేవి. కానీ, ఇకపై మీరు బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లలో .bank.in (డాట్ బ్యాంక్ డాట్ ఇన్) అనే డొమైన్‌ను మాత్రమే చూస్తారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సైబర్ నేరాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.సైబర్ మోసగాళ్ల నుంచి అమాయక ప్రజలను కాపాడేందుకు ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. .com లేదా .co.in వంటి డొమైన్‌లు ఎవరైనా సులభంగా కొనుగోలు చేయగలిగేవి. ఈ అవకాశాన్ని వాడుకుని మోసగాళ్లు ఏం చేసేవారంటే...బ్యాంకుల పేరును పోలినట్టుగా చిన్న మార్పులతో (ఉదాహరణకు, hdfcbank.com బదులు hbfcbank.com) నకిలీ వెబ్‌సైట్లను క్రియేట్ చేసేవాళ్లు. ఈ నకిలీ వెబ్‌సైట్లు అచ్చం అసలు బ్యాంక్ వెబ్‌సైట్‌లాగే కనిపించేవి. దీంతో వినియోగదారులు ఆ నకిలీ సైట్‌లోకి వెళ్లి, తమ యూజర్ నేమ్, పాస్‌వర్డ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను ఇచ్చి మోసపోతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకే 2025 అక్టోబర్ 31లోగా తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌ డొమైన్‌ను .bank.inకు మార్చుకోవాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశించింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, పీఎన్‌బీ వంటి చాలా బ్యాంకులు ఇప్పటికే ఈ మార్పును అమలు చేశాయి. .bank.in డొమైన్ వల్ల ప్రయోజనం ఏంటి? సాధారణ .com డొమైన్ లా కాకుండా, .bank.in డొమైన్ పొందడం అంత సులువు కాదు. ఈ కొత్త డొమైన్ వల్ల వినియోగదారులకు, బ్యాంకులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే.. ఈ డొమైన్‌ను కేవలం ఆర్‌బీఐ నుంచి గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలకు మాత్రమే కేటాయిస్తారు. ఎవరంటే వారు ఈ డొమైన్‌ను పొందడానికి అవకాశం ఉండదు. వెబ్‌సైట్ అడ్రస్‌లో .bank.in అని ఉంటే, అది కచ్చితంగా రిజిస్టర్ అయిన, అధికారిక బ్యాంక్ పోర్టల్ అని వినియోగదారులు నమ్మవచ్చు. నకిలీ వెబ్‌సైట్లను సృష్టించే మోసగాళ్లకు ఈ కొత్త నిబంధన పెద్ద అడ్డంకిగా మారుతుంది. మీరు ఏం చేయాలి? ఇకపై ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే ముందు, వెబ్‌సైట్ అడ్రస్‌లో తప్పనిసరిగా .bank.in అనే డొమైన్ ఉందో లేదో సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఈ చిన్న జాగ్రత్తతో మీరు సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా మీ డబ్బును, ముఖ్యమైన వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com