ట్రంప్ సంచలన ప్రకటన..

- April 12, 2026 , by Maagulf
ట్రంప్ సంచలన ప్రకటన..

: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన కీలక శాంతి చర్చలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ హై-వోల్టేజ్ సమావేశాల్లో ఎలాంటి ఒప్పందం కుదరలేదు.  అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందాలు ఈ ప్రతిష్ఠాత్మక చర్చల్లో పాల్గొన్నాయి. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్లకు ఇరాన్ ప్రతినిధులు ససేమిరా అనడంతో చర్చలు అర్ధాంతరంగా విఫలమయ్యాయి. తాము తుది, అత్యుత్తమ ఆఫర్ ఇచ్చామని, ఇరాన్ దాన్ని అంగీకరించలేదని వాన్స్ తెలిపారు.

ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో ఇరాన్ పని పడతామని, ఆ దేశాన్ని పూర్తిగా అంతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.

చర్చలు విఫలమైన వెంటనే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం దిగ్బంధనం ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మార్గం గుండా ప్రయాణించే, బయటకు వచ్చే ప్రతి నౌకను అడ్డుకోవాలని నేవీని ఆదేశించారు. ఇరాన్‌కు అక్రమంగా టోల్ చెల్లించిన నౌకలను అంతర్జాతీయ జలాల్లో ఎక్కడికక్కడ నిలిపివేస్తామన్నారు. అమెరికా నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపితే వారిని నరకానికి పంపుతామని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

అమెరికా డిమాండ్లను ఇరాన్ తీవ్రంగా తప్పుబట్టింది. అణ్వాయుధాలపై అమెరికా అహేతుకమైన, చట్టవిరుద్ధమైన షరతులు పెట్టిందని ఇరాన్ విదేశాంగ శాఖ విమర్శించింది. యుద్ధం ద్వారా సాధించలేని వాటిని సుదీర్ఘ చర్చల ద్వారా పొందాలని అమెరికా చూస్తోందని, దానికి తాము స్పష్టంగా 'నో' చెప్పామని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు, ఆహార భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని యూఏఈ ఇంధన సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ శాంతి చర్చలకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అక్కడి సైనిక ఉన్నతాధికారులు మధ్యవర్తిత్వం వహించారు. ఇరు పక్షాలు అంగీకరిస్తే భవిష్యత్తులోనూ చర్చలకు సహకరిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్‌లో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు 3,375 మృతదేహాలను గుర్తించగా, వారిలో వందలాది మంది చిన్నారులు ఉన్నారు. చర్చల వైఫల్యంతో ఈ భయంకర యుద్ధం మరింత వినాశనానికి దారి తీస్తుందని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com