తెలంగాణ విద్యాభివృద్ధికి కార్పొరేట్ సంస్థల చేయూత
- May 24, 2026
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు అందించనున్న రహేజా గ్రూప్, రాంకీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా రహేజా గ్రూప్, రాంకీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్లు విద్యాశాఖతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రాంకీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు.
ఒప్పందాల ప్రకారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతులతో కూడిన కొత్త విద్యా ప్రాంగణ నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయంలో 40 శాతం, అంటే రూ.19.66 కోట్లను రాంకీ సంస్థ భరించనుంది.
అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ ఉన్నతీకరణలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి, ఇంటర్ తరగతుల నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయంలో 40 శాతం, అంటే రూ.10.4 కోట్లను కూడా రాంకీ సంస్థ అందించనుంది.
రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల నిర్మాణానికి అవసరమైన రూ.50.50 కోట్ల మొత్తాన్ని రహేజా గ్రూప్ భరించనుంది.
ఇక మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్‌నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ, 6వ మరియు 7వ తరగతుల అభివృద్ధికి అవసరమైన రూ.12.20 కోట్లను యశోదా హాస్పిటల్స్ అందించనున్నాయి.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) చైర్మన్ సి. శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం విద్యారంగానికి ఊతమిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- శ్రీ శ్రీ రవిశంకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- అత్యంత వైభవంగా NATS సాంస్కృతిక సంబరాలు
- వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం- 15- 30 రౌండ్ల ఫైరింగ్
- నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
- లక్కీ డ్రా విజేత సంఖ్యలను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- ఈద్ అల్ అదా.. 4 ఎమిరేట్లలో ఫ్రీ పార్కింగ్..!!
- ఒమన్‌లో వాహనంతో ఢీకొట్టి చంపిన కేసులో వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో వారంలో 1,158 మంది అక్రమ నివాసితులు అరెస్టు..!!
- ద్వైపాక్షిక సహకారంపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!









