స్టీల్ ప్లాంట్ బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శ..

- June 09, 2026 , by Maagulf
స్టీల్ ప్లాంట్ బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శ..

విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే విశాఖకు చేరుకున్న ఆయన, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను స్వయంగా అడిగి ప్రమాదం జరిగిన తీరును, వారికి అందుతున్న వైద్య సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్‌లోని ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ప్లాంట్ యాజమాన్యం, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్‌ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు మరణించిన వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గాయపడిన వారికి రూ. 10 లక్షల తక్షణ సాయంతో పాటు, వారి చికిత్సకయ్యే పూర్తి ఖర్చులను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భరిస్తుందని వెల్లడించారు.

కార్మికులతో ప్రత్యేక సమావేశం
గత 30 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి ఘోర దుర్ఘటన జరగలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రి కూడా ప్లాంట్‌లో ఒక చిన్న సాంకేతిక లోపం తలెత్తిందని, అయితే రాత్రి వేళ కార్మికులు ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తన దృష్టికి వచ్చిందని ఆయన వివరించారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, యంత్రాల ఆధునికీకరణపై సమగ్ర దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, వారి నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై, వారి భద్రతపై త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్వయంగా కార్మికులతో మాట్లాడతానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం బాధపడి వదిలేయకుండా.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు యాజమాన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన గట్టిగా సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com