హెచ్‌1బీ : ట్రంప్‌కు కాంగ్రెస్‌ సభ్యుల నుండి చుక్కెదురు

- January 05, 2018 , by Maagulf
హెచ్‌1బీ : ట్రంప్‌కు కాంగ్రెస్‌ సభ్యుల నుండి చుక్కెదురు

వాషింగ్టన్‌ : హెచ్‌1బీ వీసా నియంత్రణలపై ట్రంప్‌ యంత్రాంగం చర్యలను కొందరు అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు వ్యతిరేకిస్తుండటంతో భారత ఐటీ రంగానికి చెందిన నిపుణుల ఆశలు చిగురిస్తున్నాయి. హెచ్‌1బీ వీసాలను కుదిస్తే దాదాపు 5 లక్షల నుంచి 7.5 లక్షల మంది భారత ప్రొఫెషనల్స్‌ దేశాన్ని విడిచివెళతారని, దీంతో అమెరికాను నైపుణ్యాల కొరత వెంటాడుతుందని కాంగ్రెస్‌ సభ్యులతో పాటు పలు ఇండో అమెరికన్‌ సంస్థలు ట్రంప్‌ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలనే ట్రంప్‌ నినాదంలో భాగంగా హెచ్‌1బీ వీసాల నియంత్రణను అమెరికా తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే.

హెచ్‌1బీ వీసాలు కలిగిన వారిపై ఈ నిరంకుశ నియంత్రణలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని, అమెరికన్‌ సమాజంలో నైపుణ్యాల కొరత తలెత్తుందని డెమొక్రటిక్‌ సభ్యురాలు తుల్సి గబార్డ్‌ అన్నారు. అన్నింటికీ మించి అమెరికాకు కీలక భాగస్వామి భారత్‌తో సంబంధాలు దెబ్బతింటాయని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చిన్న వాణిజ్య సంస్థలు, ఉద్యోగాలను సృష్టిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతంగా ఉన్న భారత హెచ్‌1బీ వీసాహోల్డర్లు దేశాన్ని వీడే పరిస్థితి నెలకొంటుందని అన్నారు.

21వ శతాబ్ధంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అమెరికా పోటీ పడే క్రమంలో నైపుణ్యాల లేమి అవరోధంగా నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌1బీ వీసా గడువు పెంపును నిరాకరిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.  వేలాది నైపుణ్యంతో కూడిన నిపుణులను ఎలా తిప్పిపంపుతారని ప్రశ్నించింది. మరోవైపు ఈ ప్రతిపాదనను ట్రంప్‌ యంత్రాంగం వెంటనే విరమించాలని ఇండో అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కోరారు. ఈ ప్రతిపాదన వలస వ్యతిరేకమైనదని మరో సభ్యుడు ఆర్‌ ఖన్నా వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com