రివ్యూ: ఇగో

- January 19, 2018 , by Maagulf
రివ్యూ: ఇగో

సినిమా పేరు: ఇగో

నటీనటులు: ఆశిష్‌ రాజ్‌, సిమ్రన్‌ శర్మ, అజయ్‌, రావు రమేశ్‌, పృథ్వీ తదితరులు

సంగీతం: సాయి కార్తిక్‌

నిర్మాత: కె.ఆర్‌ విజయ్‌ కరణ్‌

దర్శకుడు: సుబ్రహ్మణ్యం

విడుదల తేదీ: 19-01-2018

కథేంటంటే..: అమలా పురంలో ఇందు(సిమ్రన్‌), గోపి(ఆశిష్‌ రాజ్‌) అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇద్దరికీ క్షణం కూడా పడదు. ఇగో ఎక్కువ. ఒకరినొకరు ఏడిపించుకుంటూ ఉంటారు. ఇందుకి ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటారు. ఇందుకంటే ముందు తానే పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్‌ వస్తాడు ఇంద్ర. హైదరాబాద్‌ వచ్చాక ఇందుపై తనకున్నది కోపం, ద్వేషం, కాదు ప్రేమ అని తెలుస్తుంది. అదే సమయంలో ఇందుకు కూడా గోపిపై ప్రేమ పుడుతుంది. అమలాపురం వెళ్లి తన ప్రేమను చెప్పాలనుకుంటాడు. ఇంతలో అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఓ హత్యకేసులో గోపిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. ఈ కేసులో అతను ఎలా ఇరుక్కున్నాడు? గోపి, ఇందు కలుసున్నారా లేదా? అన్నదే కథ.

ఎలా ఉందంటే:

అబ్బాయి అమ్మాయి కొట్టుకోవడం, ఆ తరువాత ప్రేమలో పడటం 'ఆనందం' సినిమా నుంచీ చూస్తున్నాం. దర్శకుడు మళ్లీ అదే కథను ఎంచుకున్నాడు. కాకపోతే నేపథ్యం పల్లెటూరికి మారింది. రకరకాల వ్యక్తిత్వాలను ఆసరాగా చేసుకుని తొలి భాగం వినోదం పండించాలని చూశాడు. హీరోహీరోయిన్ల గొడవ, పోలీసు అధికారిగా పృథ్వీ చేసిన కామెడీ, పాటలు వీటి కోసమే దర్శకుడు సగం సినిమాను కేటాయించాడు. తొలి భాగంలో కథేం ముందుకు సాగదు. కేవలం వినోద సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యాడు. ద్వితీయార్థంలో హీరోహీరోయిన్ల గొడవ ముదిరి ప్రేమగా మారుతుంది. గోపిని వెతుక్కుంటూ ఇందు..ఇందును వెతుక్కుంటూ గోపి ఇలాంటి సన్నివేశాలతో దర్శకుడు వృథా చేశాడు. పతాక సన్నివేశాలకు ముందు కథలో మలుపు వస్తుంది. సినిమా సడెన్‌గా ఓ మర్డర్‌ మిస్టరీగా మారుతుంది. దాన్ని ఛేదించే క్రమంలో దర్శకుడు తన తెలివితేటలను వాడుంటే బాగుండేది. హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆ సన్నివేశాలను పకడ్బందీగా రాసుకుంటే ఈ కథకు మంచి ముగింపు దక్కేది.

ఎవరెలా చేశారంటే..?

ఆశిష్‌ రాజ్‌కి ఇది రెండో సినిమా. 'ఆకతాయి' (అతను నటించిన మొదటి సినిమా)లో చేసిన పొరపాట్లు సవరించుకుంటూ నటించాడు. డ్యాన్స్‌లు, పోరాట సన్నివేశాల్లో ప్రతిభ కనబరిచాడు. కథానాయిక, ఆమె పాత్ర అంతగా ఆకట్టుకోవు. రావు రమేశ్‌..ఈ సారి ఓ కొత్త మాండలికం వినిపించాడు. ఆ పాత్రని ఇంకొంచం పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుంటే బాగుండేది. అజయ్‌, పృథ్వీల నటన ఆకట్టుకుంది. సాయి కార్తిక్‌ అందించిన పాటలు బాగున్నాయి. మాస్‌, మెలొడీ ఇలా అన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డారు. దర్శకుడు ఓ సాధారణమైన కథ ఎంచుకున్నాడు. కథలో వైవిధ్యం లేదు. పల్లెటూరి వెటకారం మినహాయింపు ప్రథమార్థంలో మెరుపులేం లేవు. దర్శకుడు తానే రాసుకున్న సంభాషణల్లో అక్కడక్కడా మెరిపిస్తాయి. పృథ్వీకి రాసిన సంభాషణలన్నీ ఆకట్టుకుంటాయి.

బలాలు

పల్లెటూరి నేపథ్యం

పృథ్వీ కామెడీ

పాటలు

బలహీనతలు

-కథ, కథనం

-ద్వితీయార్థం

చివరిగా: 'ఇగో' పాతకథే.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com