సౌదీ గగనతలంలోకి భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు అనుమతి

- February 08, 2018 , by Maagulf
సౌదీ గగనతలంలోకి భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు అనుమతి


సౌదీ గగనతలంలోకి ఎయిరిండియాకు అనుమతి

దిల్లీ: తమ దేశ గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి సౌదీ అరేబియా భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు అనుమతి ఇచ్చింది. దిల్లీ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి సౌదీ అరేబియా తమ దేశ గగనతలం నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ పత్రిక వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని భారత విమానయాన శాఖ గానీ, ఎయిరిండియా గానీ ధ్రువీకరించలేదు. మార్చి నుంచి దిల్లీ-టెల్‌అవీవ్‌ల మధ్య వారానికి మూడు సార్లు విమానం నడిపేందుకు డీజీసీఏను ఎయిరిండియా అనుమతి కోరిందని, అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. అలాగే దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో, టెల్‌అవీవ్‌లోని బెన్‌ గురియాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ విమాన సర్వీసుకు స్లాట్ల కోసం ఎదురుచూస్తున్నామని మరో ఎయిరిండియా అధికారి వెల్లడించారు.

పలు అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలు ఇజ్రాయెల్‌ విషయంలో వ్యతిరేక ధోరణితో ఉన్నాయి. కాబట్టి తమ దేశాల గగనతలాల నుంచి ఇజ్రాయెల్‌కు విమానాల రాకపోకలను కూడా అంగీకరించవు. ఈ నేపథ్యంలో సౌదీ ఎయిరిండియాకు అనుమతి ఇచ్చిందని వార్తలు రావడం చర్చనీయాంశమైంది. సౌదీ అనుమతి ఇస్తే ఎయిరిండియాకు టెల్‌అవీవ్‌ వెళ్లడానికి దూరం తగ్గుతుంది. విమానం అహ్మదాబాద్‌, మస్కట్‌, సౌదీ అరేబియా మీదుగా వెళ్లి టెల్‌అవీవ్‌లో దిగొచ్చు. దీనివల్ల రెండున్నర గంటల ప్రయాణం తగ్గుతుంది. ఇంధన ధర కూడా కలిసి వస్తుంది. ప్రస్తుతం టెల్‌అవీవ్‌ నుంచి ముంబయి వచ్చే విమానాలు సౌదీ, యుఏఈ, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాల మీదుగా రాకుండా ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ అడెన్‌ల మీదుగా చుట్టు తిరిగి చాలా దూరం ప్రయాణించి భారత్‌ రావాల్సి వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com