మెక్సికో దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 7.2 మాగ్నిట్యూడ్‌తో మళ్లీ భూకంపం

- February 16, 2018 , by Maagulf
మెక్సికో దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 7.2 మాగ్నిట్యూడ్‌తో మళ్లీ భూకంపం

మెక్సికో: మెక్సికోను మళ్లీ భూకంపం వణికించింది. మెక్సికో దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 7.2 మాగ్నిట్యూడ్‌తో శుక్రవారం శక్తిమంతమైన భూకంపం నమోదైంది. దేశ రాజధాని నగరంలోని ప్రజలు, అలాగే ఒయక్సాకా రాష్ట్ర రాజధానిలోను నివాస భవనాల నుంచి, కార్యాలయాల నుంచి బైటికి పరుగులు తీశారు. మెక్సికో ఫసిఫిక్‌ తీరంలోని గ్రామీణ ప్రాంతాలకు దగ్గరల్లో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు నమోదైంది. గతేడాది సెప్టెంబరు 19న భూకంపంతో మెక్సికోలో 228 మంది, ఆయా రాష్ట్రాల్లో 141 మంది మృత్యువాత పడ్డ దుర్ఘటన విదితమే. అప్పుడు దెబ్బతిన్న భవనాలు మెక్సికోలో ఇంకా అలాగే ఉన్నాయి. దెబ్బతిన్న గృహాల వారికి సహాయక శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుత భూకంపం ముందు 7.5తో ప్రారంభమై తర్వాత తీవ్రత 7.2కు తగ్గిందని యూఎస్‌ జియెలాజికల్‌ సర్వే పేర్కొంది. ఒక్సాకా రాష్ట్రానికి దక్షిణాన పినోటేపాకు ఈశాన్యంగా 53కిలోమీటర్ల దూరంలో 24 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం నమోదైందని ఈ సర్వే పేర్కొంది. ఇంతవరకు మృతుల సంఖ్యగాని, నష్టాలుగాని రిపోర్టు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. తాను ఇంటి బయట ఒక బెంచీపై కూర్చోగా భూమి కంపించిందని, ఆ సమయంలో రోడ్ల మీది కార్లు ఎటు నుంచి ఎటు వెళుతున్నాయో తెలియలేదని, భయంతో తాను తిరిగి తన గృహంలోకి వెళ్లలేదని మెర్సిడెస్‌ రోజాస్‌ హుట్టెరా అనే 57 ఏళ్ల మహిళ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com