పైలట్ ఫాతిమా:స్పెషల్ స్టోరీ
- April 14, 2018హైదరాబాద్:సయ్యద్ సల్వా ఫాతిమా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతి. ఆమె తండ్రి బేకరీలో పనిచేస్తుంటాడు. చిన్నతనంలో కనిపించిన ప్రతి పేపర్‌ముక్కను తీసుకుని అందులో ఏముందో చదువుతుండేది ఫాతిమా. ఆ అలవాటులో భాగంగానే ఏవియేషన్‌కి సంబంధించిన ఏ పేపరు ముక్క కనిపించినా దాన్ని ఆమె చాలా భద్రంగా దాచుకునేది. ఆమె పైలట్ కావాలన్న కల అప్పటిది. ఈ కలనే తన స్నేహితులతో చెప్పినప్పుడు కొందరు నవ్వితే, మరికొందరు జాలిగా చూశారు. దానికి కారణం కుటుంబ ఆర్థికపరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం తన కలలకు రెక్కలొచ్చాయన్నట్లు చిరునవ్వుతో కమర్షియల్ పైలట్ లైసెన్స్ చూపిస్తోంది ఫాతిమా.
ఏవియేషనే ఇష్టం
ఫాతిమా తండ్రి సల్వా బేకరీలో పనిచేస్తుంటాడు. తన కూతురి కాంక్ష, ఆశయం అర్థంచేసుకున్నాడు. కానీ ఆర్థికంగా అంత మొత్తాన్ని భరించేశక్తి తనకు లేదు. అయినప్పటికీ ఆమె కలలకు ఎక్కడా విఘాతం కలగనివ్వలేదు. సాధ్యమైనంత సహకరించడానికి ప్రయత్నించాడు. అంతకుమించి ఫాతిమా తన కలల్ని నిజం చేసుకోవడానికి తానే ఎక్కువ కష్టపడింది. పాఠశాల స్థాయి నుంచి ఫాతిమా చదువులో ముందుడేది. చదువుతో పాటు ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొనేది. ఆ తర్వాత మెహదీపట్నంలోని సెంట్ ఆన్స్ జూనియర్ కాలేజ్‌లో చదువుకుంది. తదనంతరం తల్లిదండ్రుల బలవంతంతో ఎమ్‌సెట్ పరీక్షలు రాసింది. దాంట్లో మంచి ర్యాంక్ వచ్చి, ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీటు వచ్చినా చేరలేదు ఫాతిమా. తనకిష్టమైన ఏవియేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించుకుని 2007లో ఒకప్పటి ఆంధ్రప్రదేశ్, ఇప్పటి తెలంగాణా రాష్ట్ర ఏవియేషన్ అకాడమీలో చేరింది. అక్కడే ఆమె మొట్టమొదటిసారి ఆకాశ విహారం చేసింది. 2013 కల్లా ఆమె విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకుంది. శిక్షణలో భాగంగా సెస్నా 152, సెస్నా 172 ఎయిర్‌క్రాఫ్ట్‌లో 200 గంటలు విమానాన్ని నడిపింది. అందులో 120 గంటలు ఫాతిమా ఒంటరిగా విమానాన్ని నడిపింది.
అవాంతరాలను అధిగమించి
శిక్షణ తర్వాత పైలట్ కావాలనే కలను సాకారం చేసుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ అప్పటికే '24 ఏళ్లు వచ్చాయి పెళ్లి చేసుకో'మని కుటుంబం బలవంతం పెట్టింది. ఆ ప్రతిపాదనకు అంగీకరించక తప్పలేదామెకు. ఆటోమొబైల్స్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. ఆ సమయంలోనే తెలంగాణా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిదామెకు. అప్పటికి ఆమె నాలుగో నెల గర్భిణీ. ఇంట్లో అందరిదీ ఒకటే ప్రశ్న 'ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తావ్?' అని. ఇన్నేళ్లు ఎదురుచూసిన అవకాశం చేతికి అందివచ్చింది. వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదు. ముందుకే వెళ్తాను అన్నది ఫాతిమా నిశ్చితంగా. ఏడాది టైమ్ తీసుకుని, డెలివరీ తర్వాత శిక్షణకు వెళ్లింది. వైఫల్యాలూ తప్పలేదు. ఫాతిమా తన పైలట్ ప్రస్థానంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది. తొలి దఫా శిక్షణ కోసం వెళ్లినప్పుడు అసలక్కడ విమానమే సిద్ధంగా లేదు. దాంతో శిక్షణను జిఎమ్‌ఆర్ అకాడమీకి మార్చారు. శిక్షణలో భాగంగా నావిగేషన్ పేపర్ మూడుదఫాలు ఫెయిలయినట్లు అధికారులు చెప్పారు. తన ఆత్మవిశ్వాసం తగ్గిపోయిన సమయంలో అక్కడి ప్రొఫెసర్‌లు ధైర్యం చెప్పారు. తర్వాత న్యూజిలాండ్‌లో 62 గంటలపాటు ట్రైనింగ్ మోషన్‌లో విమానాన్ని స్వయంగా నడపడం, 52 గంటల పాటు మల్టీ ఫంక్షన్ ఫ్లైయింగ్ వంటివి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇక వెనుతిరిగింది లేదు. పైలట్ కావాలన్న ఫాతిమా కలకు నిజంగా రెక్కలొచ్చాయి.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్‌లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం