డ్రాగన్‌తో టైగర్...సుహృద్భావ సంబంధాలకు కీలక ముందడుగు
- April 27, 2018సరిహద్దు దేశాలైన భారత్-చైనా మధ్య సుహృద్భావ సంబంధాలకు కీలక ముందడుగు పడింది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య అనధికార శిఖరాగ్ర భేటీ ప్రారంభమైంది. హార్ట్ టు హార్ట్ సమ్మిట్‌గా పేర్కొంటున్న ఈ భేటీలో.. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, చైనాల సంప్రదాయ, సాంస్కృతిక స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య చైనాలోని పర్యాటక కేంద్రం వుహాన్‌లో శుక్రవారం అనధికార శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇందులో.. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు. భేటీ అనంతరం తొలి రోజు చర్చలు విస్తృతంగా, ఫలప్రదంగా ముగిశాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సరిహద్దు వివాదాలు సహా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపైనే వీరిరువురు చర్చించారు. ఇరుదేశాల మధ్య ఇలాంటి చర్చలు తరచూ జరుగుతూ ఉండాలని మోదీ అభిలషించారు. 2019లో భారత్‌లో జరిగే ఈ తరహా చర్చలకు రావాలని జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు.
సంయుక్త భాగస్వామ్యంతో ఇలాంటి చర్చలు భవిష్యత్తులో కూడా జరుగుతాయని ఆశిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల్లో ఈ భేటీ కొత్త అధ్యాయానికి తెరలేపనుందని ఆయన తెలిపారు. గంగా, యాంగ్జీ నదులు నిరంతరం ప్రవహిస్తున్నట్లే.. ఇరుదేశాల మధ్య స్నేహం కూడా కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు
అంతకుముందు.. శుక్రవారం వుహాన్ చేరుకున్న మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు.
చర్చల సందర్భంగా ప్రఖ్యాత చైనా కళాకారుడు జు బీహోంగ్ వేసిన చిత్రాన్ని జిన్‌పింగ్‌కు మోదీ కానుకగా ఇచ్చారు. చర్చల అనంతరం ఇరువురు నేతలు హుబీ ప్రావిన్షియల్ మ్యూజియంను సందర్శించారు. ఈ మ్యూజియంలో పెద్ద సంఖ్యలో చైనా చారిత్రక, సాంస్కృతిక స్మారకాలున్నాయి. రాత్రి ఈస్ట్ లేక్ ఒడ్డున ఉన్న అతిథిగృహంలో వీరిద్దరు మాత్రమే భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. దీంతో తొలిరోజు చర్చలు ముగిశాయి.
అటు.. చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా డోక్లాం, చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ గురించి చర్చించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎలాంటి అజెండా లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్నప్పటికీ భారత్‌కు నష్టం కలిగించే అంశాలను భేటీలో ప్రస్తావించాలన్నారు. చైనా పర్యటన సందర్భంగా మోదీ కాస్త టెన్షన్‌గా కనిపించారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి తమ పార్టీ మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?