'శ్రీకరం' వారి ఆధ్వర్యంలో రమణీయంగా 'శ్రీ శివ పార్వతుల కళ్యాణం'

- April 29, 2018 , by Maagulf

యు.ఏ.ఈ:అజ్మన్,యు.ఏ.ఈ  లో 'ఇండియన్ అసోసియేషన్ హాల్' ఆడిటోరియం నందున శ్రీకరం బృందం వారు నిర్వహించిన లఘు రుద్రాభిషేకం మరియు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగలా జరిగింది.సాంప్రదాయ దుస్తులలో ఉత్తర దక్షిణ భారతీయులు పాల్గోనటం విశేషం.యూఏఈ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మరియు ఇతర ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు సుమారు 3000 ఈ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

బ్రహ్మశ్రీ. డాక్టర్.కాకునూరి సూర్యనారాయణమూర్తి  గారి ఆధ్వర్యం లో, ఋత్వికులు శ్రీ. కూచి వంశీ కృష్ణ, కొడకండ్ల రాధాకృష్ణ  లు సాంప్రదాయబధ్ధంగా జరిపించారు. మన హిందూ వివాహ విధి ధర్మం గురించి బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి  గారి సహేతుక వివరణ, శశిధర్ మారుమాముల గారి భక్తి సంగీతం తో కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు తాదాత్మ్యం చెందారు. స్థానిక కళాకారుల బృందాలైన మ్యూజిక్  ఇండియా, శ్రీమతి లక్ష్మి కామేశ్వరి గారు వారి శిష్యులు, శ్రీమతి కొప్పర్తి ఇందిరగారి శిష్యులు  ఆలపించిన భక్తిగీతాలు, శ్రీమతి సుమతి ఆనంద్ బృందం వారి వీణా వాదన విని వచ్చిన వారు భక్తి  పరవశులయ్యారు. చిరంజీవి. శ్రావణి, శ్రీమతి. అలేఖ్య నృత్య ప్రదర్శన కార్యక్రమానికి సంపూర్ణతను చేకూర్చాయి. 
 
చివరగా సహస్ర దీపాలంకరణ, మహదాశీర్వచనం తో కార్యక్రమానికి స్వస్తి పలికారు. 

రుద్రాభిషేకం చేయించుకున్న దంపతులకి పూజ సామగ్రి, వచ్చినవారందరికి భోజన ప్రసాద ఏర్పాట్లు ఎక్కడా లోటు రాకుండా అన్నీ సమయానికి అమర్చిన శ్రీకరం బృందం కార్యకర్తలు  అభినందనీయులు.  

ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ, ప్రయాసల కోర్చి లోక కల్యాణార్థం నిర్వహించిన శ్రీకరం కార్యవర్గం శ్లాఘనీయులు. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్గా వ్యవహరించింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com