ఏపీ కి మూడు రాజధానులపై స్పందించాలని మోడీకి లేఖలు

- December 24, 2019 , by Maagulf
ఏపీ కి మూడు రాజధానులపై స్పందించాలని మోడీకి లేఖలు

అమరావతి:  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడకున్నా మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్  ప్రకటన, జీఎన్ రావు కమిటీల నివేదిక ఓ స్పష్టతనిచ్చాయి. దీంతో అమరావతి రైతులు ఆందోళనల బాటపట్టారు. 

ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని రాజధాని ప్రజలు  కొత్తతరహా నిరసనలు ప్రారంభించారు.  రైతులు, మహిళలు, సామాన్యులతో పాటు రాజధాని ప్రాంత విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రధానికి లేఖలు రాస్తున్నారు.

రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయంపై మూడుపేజీల లేఖను ప్రధాని కార్యాలయ అడ్రస్ కు పంపింస్తున్నారు. ఇదేదో రాజకీయ పార్టీ చేయిస్తున్న కుట్ర కాదని తెలియజేసేందుకు తమ ఆధార్ కార్డుల జిరాక్స్ లను కూడా ఈ లేఖకు జోడిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మూడు రాజధానులు నిర్ణయంపై జోక్యం చేసుకోవాలని రైతులు ప్రధానిని కోరుతున్నారు. పెద్ద సంఖ్యలో లేఖలను ఒక్కదగ్గరికి  చేర్చి ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ ద్వారా  రైతులు పంపిస్తున్నారు. దీనిపై ప్రధాని స్పందిస్తాడన్న నమ్మకం వుందని... ఆయనే ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిని కాపాడగలరని రైతులు అంటున్నారు. 

విశాఖపట్నం, అమరావతి, కర్నూలును ఏపీ రాజధానులుగా చేస్తామని ప్రతిపాదించారు.స్వయాన సీఎంయే ఏపీకి మూడు రాజధానలంటూ కీలక వ్యాఖ్యలు చేయడంతో అమరావతి రైతులు గగ్గోలుపెడుతున్నారు. గత ఏడు రోజులుగా రాజధాని రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. అన్నదాతలకు, విద్యార్థులు, న్యాయవాదులు తోపాటు అక్కడి సామాన్య ప్రజలు సైతం మద్దతు తెలుపుతున్నారు. "3 రాజధానులు వద్దు... అమరావతియే ముద్దు" అంటూ వారు నినాదాలు చేస్తున్నారు.   

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానుల పై అమరావతి రైతులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ రాజధాని మార్పు పై చేసే ప్రకటన తర్వాత ఆందోళనలు పెద్ద ఎత్తున చెలరేగకుండా ఉండేందుకే అమరావతి లో కట్టు దిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్టు తెలియవస్తుంది. దీంతో ఏపీ రాజధాని పై సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయబోతున్నారని సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతానికి జగన్ కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన కడప జిల్లా పర్యటనకు వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు మూడు రోజుల్లో రాజధాని మార్పుపై కీలక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.  ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల నుంచి అమరావతికి పోలీసులను భారీగా తరలిస్తున్నారు. ఏపీకి 3 రాజధానులు అవసరం అంటూ అసెంబ్లీలో సీఎం జగన్  సూత్రప్రాయంగా ప్రతిపాదించారు. అనంతరం రాజధానిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ కు నాలుగు మండళ్లు 3 రాజధానులను సమర్థిస్తూ నివేదిక ఇచ్చినట్టు తెలిపింది. జగన్ అధికారిక ప్రకటన చేసిన తరువాత గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అంబటినగర్(యర్రబాలెం) లోని ఓ కళ్యాణ మండపంలో సుమారు 300 మంది పోలీసులకు భోజన, వసతిని ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com