ఈ నెల 20 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్.. ఆ తర్వాత

- April 15, 2020 , by Maagulf
ఈ నెల 20 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్.. ఆ తర్వాత

హైదరాబాద్: కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 20 వరకు తెలంగాణలో  లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని చెప్పారు.

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్ డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి  ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి  రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేశామని, కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వైరస్ నిర్థారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పీపీఈ కిట్లకు ఏమాత్రం కొరత లేదని, 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని వెల్లడించారు.రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయని, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు... డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. 20 వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, లక్ష మంది పేషెంట్లకైనా చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని కేసీఆర్ చెప్పారు. కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com